రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు చేరడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
తూర్పుగోదావరి జిల్లా...
తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మన్యం, మెట్ట, కోనసీమలో వర్షం కురుస్తోంది. కాకినాడ, రాజమహేంద్రవరం, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, అమలాపురంలో వర్షాలు కురుస్తున్నాయి. మన్యంలో కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ పరిధిలోని నాలుగు లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పి.గన్నవరం నియోజకవర్గంలోని బూరుగులంక, జి.పెదపూడి లంక, అరిగెలవారిపేట, లంక గ్రామాలు వశిష్ఠ గోదావరి నదికి మధ్యలో ఉన్నాయి. గోదావరి వరదతో ఈ నాలుగు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు మర పడవలను ఆశ్రయిస్తున్నారు. ఈ ప్రాంతంలో గోదావరి నదిపై వంతెన నిర్మాణానికి 50 కోట్లతో రెండోసారి టెండర్లు పిలిచారు. అయితే టెండర్ ఖారారై, పనులు ఎప్పటికి పూర్తిచేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. వీలైనంత త్వరగా వంతెన నిర్మించి, ప్రయాణ కష్టాలు తీర్చాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.