తూర్పు గోదావరి జిల్లా మన్యంలో శనివారం సాయంత్రం భారీగా వర్షం కురిసింది. దీంతో కొండ వాగులు పొంగి ప్రవహించాయి. ముఖ్యంగా అడ్డతీగల గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటంతో వర్షపు నీరంతా ప్రధాన రహదారులపై ప్రవహించింది. దీంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలోని కొత్తపేట నియోజక వర్గంలోని పంట పొలాలు నీటమునిగాయి. రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట మండలంలోని ఉద్యాన పంటలు, వరి చేలు వర్షపు నీటితో మునిగాయి.
ఎగువన కురిసిన భారీ వర్షాలకు ఏలేరు రిజర్వాయరుకు దాదాపు పదివేల క్యూసెక్కుల నీరు వస్తోంది.. దీంతో అధికారులు అప్రమత్తమై 9 వేల క్యూసెక్కుల నీటిని క్రిందకు వదులుతున్నారు. ఏలేరు రిజర్వాయర్లో జలకళ సంతరించుకొంది. రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 24.11 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటిమట్టం 23.62 టీఎంసీలకు చేరుకుంది.
కోనసీమ ప్రాంతంలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. పల్లపు ప్రాంతాలు నీటమునిగాయి. అమలాపురం డివిజన్ మొత్తం మీద 1769.60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. పి. గన్నవరంలో అత్యధికంగా 174.20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇదీ చదవండి
తూర్పుగోదావరి జిల్లాలో పిడుగుపాటుకి ఇద్దరు మృతి