గోదావరి వరద ఉద్ధృతి మరింత పెరుగుతోంది. కాసేపట్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. అధికారులను విపత్తు నిర్వహణశాఖ అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలను తరలిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి పరీవాహకప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గోదారి ఉగ్రరూపం .. పెరుగుతున్న నీటిమట్టం - rain
గోదావరి వరద నీటితో ఉరకలెత్తుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ముంచెత్తుతోంది. దేవీపట్నం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరగడంతో..నాలుగు రోజులుగా దగ్గరలోని గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మరోవైపు ధవలేశ్వరం బ్యారేజీ వద్ద 11.4 అడుగులకు నీటిమట్టం చేరింది. కాసేపట్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద11.4అడుగులకు నీటిమట్టం చేరింది. బ్యారేజీ వద్ద 9.57లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో... డెల్టా కాల్వలకు 7వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజీలో 175 గేట్లు పూర్తిగా ఎత్తివేసి.. సముద్రంలోకి 9.50లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాయంత్రంలోగా నీటిమట్టం మొదటి ప్రమాదస్థాయికి చేరుకునే అవకాశం ఉంది. తెలంగాణలోని భద్రాచలం వద్ద 44.1 అడుగులకు నీటి మట్టం చేరడంతో..అధికారులు మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
వరద ముంపులో 600 ఇళ్లు
తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరిగింది. ఆర్ అండ్ బీ రహదారులపై ఉద్ధృతంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. పలు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. గండిపోచమ్మ ఆలయంలోకి వరద నీరు చేరింది. దేవీపట్నం- తొయ్యారు రహదారిపై 4 అడుగుల మేర నీరు నిలిచింది. పోచమ్మగండి, పూడిపల్లి, తొయ్యారు, దేవీపట్నంలో 600 ఇళ్లు నీట మునిగాయి. మరోవైపు పూడిపల్లి వద్ద చేపతల్లి వాగుకు వరద ఉద్ధృతి పెరగడంతో..దామనపల్లి వరకు వరద నీరు వెళ్లింది. పోచమ్మగండి వద్ద అమ్మవారి ఆలయ హుండీలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దండంగి ఎస్సీకాలనీ, పాతూరు, గానుగలగొందులో వరద నీరు ఇళ్లలోకి చేరింది. చినరమణయ్యపేట, దేవీపట్నం ప్రాంతాల్లో అరటి తోటలు సైతం నీట మునిగాయి. సహాయం కోసం బాధితులు ఎదురు చూస్తున్నారు. ఇళ్లలోని సామాగ్రిని తరలించేందుకు పడవలు ఏర్పాటు చేయలేదని ఆందోళనకు దిగారు. మరోవైపు వరద ఉద్ధృతి పెరగటంతో 50 కుటుంబాలు కొండపై తలదాచుకుంటున్నాయి.తొయ్యేరు,దేవీపట్నం, పూడిపల్లిలో ప్రభుత్వ పాఠశాలలు నీట మునిగాయి.