ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉగ్ర గోదావరి ఉరకలేస్తోంది.. వరద ముంచెత్తుతోంది! - లంకగ్రామాలకు వరద సమస్య న్యూస్

గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉభయగోదావరి జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీవద్ద మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సోమవారం సాయం త్రం ఆరింటికి బ్యారేజీ వద్ద నీటిమట్టం 18.20 అడుగులకు చేరింది. సముద్రంలోకి 19.69 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. సోమవారం రాత్రి నుంచి 2,3 రోజులు ప్రవాహం మరింత పెరిగి ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఉగ్ర గోదావరి.. ఉరకలేస్తోంది
ఉగ్ర గోదావరి.. ఉరకలేస్తోంది

By

Published : Aug 18, 2020, 5:51 AM IST

Updated : Aug 18, 2020, 6:27 AM IST

తూర్పుగోదావరి జిల్లాలోని 23 మండలాల పరిధిలో 146 గ్రామాలను ముంపు భయం వెంటాడుతోంది. చింతూరు, ఎటపాక, వీఆర్‌పురం, కూనవరం మండలాల్లోని 57 గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. కాటన్‌ బ్యారేజీకి దిగువన కోనసీమలోని ముమ్మిడివరం, పి.గన్నవరం, అయినవిల్లి, అల్లవరం మండలాల్లో 12 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. రాజమహేంద్రవరం నగరం, సీతానగరం మండలంలోని ముల్లంకకూ వరద సమస్య ఎదురైంది.

ఉగ్ర గోదావరి ఉరకలేస్తోంది.. వరద ముంచెత్తుతోంది!

* దేవీపట్నం మండలంలోని 36 గ్రామాల పరిధిలో 3వేల ఇళ్లు నీట మునిగాయి. 5రోజులుగా దేవీపట్నం జలదిగ్బంధంలోనే ఉంది.
* చింతూరుకు ఆదివారం అర్ధరాత్రి వరద చేరింది.
* 14 గ్రామాలు ఇందులో చిక్కుకున్నాయి. కూనవరం మండలంలో 15 గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి.
* ఉభయగోదావరి జిల్లాల్లోని 133 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచి పోయింది.
* వరదల వల్ల రాష్ట్రంలో 50వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.

పోలవరం ఎగువ కాఫర్‌డ్యాం వద్ద సోమవారం ఉదయం 11 గంటలకు 30.50 మీటర్లకు వరద పెరిగింది. అటు ఎగువ కాఫర్‌డ్యాం, ఇటు స్పిల్‌వే ద్వారా వరద దిగువకు వెళుతోంది. పోలవరం గ్రామం వద్ద సాయంత్రానికి 15.25 మీటర్లకు వరద పెరిగింది. గంటకు 2-3 సెం.మీ.చొప్పున వరద ముప్పు పెరుగుతోంది.

* తూర్పుగోదావరి జిల్లాలో 95 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి 14,477 మందిని తరలించామని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. కేంద్రాల వద్ద వైద్య శిబిరాలతోపాటు కరోనా పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌ వచ్చినవారిని కొవిడ్‌ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కరోనా తీవ్రత వేళ పునరావాస కేంద్రాలకు వెళ్లడానికి చాలా మంది ఇష్టపడడం లేదు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి తొమ్మిది లాంచీలు, 135 మర బోట్లను సిద్ధం చేశారు. ముంపు ప్రాంతాల్లో మంత్రి వేణుగోపాలకృష్ణతో కలిసి కలెక్టర్‌ పర్యటించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో అధికారుల స్పందన
* పోలవరం మండలంలో 19 ముంపు గ్రామాల్లో 1543 మందిని సహాయ శిబిరాలకు తరలించారు. వేలేరుపాడు మండలంలోని 35 గ్రామాల్లో 4వేల మంది నిరాశ్రయులయ్యారు. రుద్రంకోటలో 600 కుటుంబాలు సమీపంలోని గుట్టపైన గుడారాలు ఏర్పాటు చేసుకున్నాయి. బాధితులను పడవలు, లాంచీల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
* పోలవరం గ్రామాన్ని అధికార యంత్రాంగం రక్షించింది. నెక్లస్‌బండ్‌కు గండ్లు పడకుండా కోతకు గురైన ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఆర్డీవో ప్రసన్నలక్ష్మి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, సిబ్బంది ఇసుక బస్తాలు వేయించారు. సోమవారం రాత్రి పాత పోలవరం వద్ద గోదావరి గట్టు తెగి గ్రామంలోకి వరద వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.
* డెల్టాలోని యలమంచిలి, ఆచంట, నరసాపురం, నిడదవోలు, పెరవలి మండలాల్లోని లంక గ్రామాలు నీట మునిగాయి. ప్రధానంగా యలమంచిలి మండలంలోని 10 లంక గ్రామాల్లోకి వరద చేరింది.

ఉగ్ర గోదావరి ఉరకలేస్తోంది.. వరద ముంచెత్తుతోంది!

కరోనాతో ఆత్మీయులూ దూరం
కరోనా భయంతో వరద బాధితుల వేదన వర్ణనాతీతంగా ఉంది. బంధువులు, తెలిసిన వారున్నా ఆశ్రయం దొరకడం లేదు. ఈ దుర్భర పరిస్థితుల మధ్య కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని లచ్చిగూడెం, కొయిదా, బుర్రెడ్డిగూడెం గ్రామాల నిర్వాసితులు కొండలు, గుట్టల వద్దకు చేరుతున్నారు. కుక్కునూరులోని కొన్ని కుటుంబాలు బస్‌షెల్టర్లను ఆవాసాలు చేసుకున్నాయి.
బాధితులను ఆదుకుంటాం: మంత్రి నాని
పశ్చిమగోదావరి జిల్లాలో 9 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశామని ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. పోలవరం వద్ద వరదను ఉన్నతాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు నుంచి ఎగువకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో సహాయచర్యల కోసం పక్క రాష్ట్రాల అధికారులతో మాట్లాడి లాంచీలు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ముంపు గ్రామాల్లో ప్రతి కుటుంబానికి 5కిలోల బియ్యం, కిలో కందిపప్పు, నూనె ప్యాకెట్‌, కూరగాయలు అందిస్తామన్నారు.

133 గ్రామాలకు నిలిచిన విద్యుత్‌: బాలినేని
వరదల వల్ల ఉభయగోదావరి జిల్లాల్లోని 133 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిందని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. గోదావరి జిల్లాల్లో విద్యుత్‌ సరఫరాపై ఆయన అధికారులతో సమీక్షించారు. పునరుద్ధరణ చర్యలు ముమ్మరం చేశామని శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ తెలిపారు.
* వరదల వల్ల రాష్ట్రంలో 50వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కర్నూలు జిల్లాలో 30వేల ఎకరాలు, కృష్ణాలో 9,300, తూర్పుగోదావరిలో 6,525, పశ్చిమగోదావరిలో 4వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. చాలాచోట్ల వరి బాగా దెబ్బతింది. నెల్లూరు, విశాఖలోనూ నష్టం వాటిల్లింది.
ఉత్తర బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం
ఉత్తర బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు. 24 గంటల్లో ఇది మరింత బలపడి క్రమంగా పడమర దిశగా కదలవచ్చని వివరించారు. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని అన్నారు. మరో పక్క వచ్చే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని దిల్లీలోని కేంద్ర జలసంఘం కూడా హెచ్చరించింది.
తెలంగాణలో వరద ఉద్ధృతి
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు చాలా జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరంగల్‌లోని పలు కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నాలుగు వేలకుపైగా జనం సుమారు 13 పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో వేలాది మంది నీళ్లలో చిక్కుకున్నారు. భద్రాచలంలోని లోతట్టు కాలనీలను గోదావరి నీరు ముంచెత్తింది. రాకపోకలు స్తంభించాయి. భద్రాచలం ఆర్టీసీ డిపో నుంచి బస్సులను నిలిపేశారు. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు, ఏపీలోని కూనవరానికి రాకపోకలు ఆగిపోయాయి. కరీంనగర్‌ జిల్లా కేశవపట్నం సమీపంలోని వాగు దాటుతున్న 30 గొర్రెలు వరదలో కొట్టుకుపోయాయి. సింగరేణి వ్యాప్తంగా 19 ఉపరితల గనుల్లో యంత్రాలు నిలిచిపోయాయి.

ఇదీ చదవండి: ధవళేశ్వరం వద్ద గోదారి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Last Updated : Aug 18, 2020, 6:27 AM IST

ABOUT THE AUTHOR

...view details