ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద ఉద్ధృతితో భయం భయం.. జలదిగ్బంధంలోనే గ్రామాలు - తూర్పు గోదావరిలో భారీ వరదలు న్యూస్

గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఎగువ ప్రాంతాల్లో నది శాంతిస్తున్నా ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద మాత్రం జోరు తగ్గలేదు. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. విలీన మండలాలతో పాటు కాటన్‌ బ్యారేజీకి దిగువున ఉన్న కోనసీమలోని లంక మండలాలను ముంపు ముప్పు వెంటాడుతూనే ఉంది. బాధితులకు తక్షణ సాయంగా 2 వేల రూపాయల ఆర్థిక సాయం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

heavy floods to godavari river
heavy floods to godavari river

By

Published : Aug 19, 2020, 5:32 AM IST

భద్రాచలం వద్ద మంగళవారం 4 గంటలకు గోదావరి నీటి మట్టం 52.8 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు అధికారులు. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద మాత్రం మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాటన్‌ బ్యారేజీ 175 గేట్లను పూర్తిగా ఎత్తివేసి ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని నేరుగా సముద్రంలోకి వదులుతున్నారు. సాగు కోసం మూడు డెల్టాలకు 6,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని 23 మండలాల పరిధిలో 158 గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. జనజీవనం స్తంభించింది. 49 వేల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. వ్యవసాయ పంటలు 1614.30 హెక్టార్లలో, ఉద్యాన పంటలు 5968.50 హెక్టార్లలో నీట మునిగాయి. 3,822 గృహాలు దెబ్బతిన్నాయి. 28వేల 555 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని విలీన మండలాలను వరద ముంపు వీడలేదు. బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. దేవీపట్నం మండలంలో స్వల్పంగా వరద తగ్గుముఖం పట్టినా 36 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రాకపోకలు, విద్యుత్తు సరఫరా నిలిచిపోయాయి. కొండలపై ఉన్న వరద బాధితులు తాగునీళ్లు దొరక్క ఇబ్బందిపడుతున్నారు. పోచమ్మగండి, పూడిపల్లి, దేవీపట్నం వరద నీటిలోనే ఉన్నాయి. కచ్చులూరు నుంచి కొండమొదలు వరకూ గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు. నీటిలో నానుతున్న ఇళ్లు కూలిపోతున్నాయి.

గోదావరి వరదలు కోనసీమలోని లంక రైతులను అన్ని విధాల నష్ట పరిచింది. ఇంకా చాలా లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. వరద నీటిలోనే ఇళ్లు నానుతున్నాయి. రాకపోకలు స్తంభించి జనం తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. రైతులు ప్రాణాలకు తెగించి లంకలో ఉన్న పశువులను పడవలు కట్టి అతి కష్టం మీద ఒడ్డుకు చేరుస్తున్నారు. రావులపాలెం మండలం ఉబలంకలో వెంకట సత్యనారాయణ రాజు వరదలో చిక్కుకున్న గేదెలను రక్షించే క్రమంలో తాను నీటిలో పడి మృతి చెందాడు. వరదల వల్ల పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఎమ్మెల్సీ మాధవ్ డిమాండ్‌ చేశారు. కొత్తపేట మండలంలోని ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.

వశిష్ట గోదావరి పోటెత్తడంతో పశ్చిమగోదావరి జిల్లాలో ఎనిమిది లంక గ్రామాల్లోకి వరద ప్రవేశించింది. యలమంచిలి, ఆచంట మండలాల్లో లంక గ్రామాలు వరద తాకిడితో వణికిపోతున్నాయి. ఇళ్లలోకి సైతం వరద నీరు ప్రవేశింది. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ఉద్యాన, వరి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో నీటమునిగిన కుక్కునూరు, వేలేరుపాడు విలీన మండలాల్లో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు పర్యటించారు. బాధితులకు నిత్యావసర సరకులు, కూరగాయల పంపిణీ చేశారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని .. బాధితుల కుటుంబానికి 2 వేల చొప్పున ఇవ్వాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. వరద బాధితులకు ఎక్కడా సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని... ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన అనంతరం రాజమహేంద్ర వరంలో జిల్లా ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాలపై వరద ప్రభావంపై చర్చించారు. పంట నష్టం వివరాలు, సహా ముంపు గ్రామాల్లో తీసుకుంటోన్న సహాయక చర్యలపై ఆరా తీశారు. పునరావాస కేంద్రాల్లో లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

వరద ఉద్ధృతితో భయం భయం.. జలదిగ్బంధంలో గ్రామాలు

ఇదీ చదవండి:వరద ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ విహంగ వీక్షణం

ABOUT THE AUTHOR

...view details