రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల్లో పోటెత్తుతున్న వరదకు...గోదావరి పరవళ్లు తొక్కుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద వరద ప్రవాహం ఎక్కువైంది. గోదావరికి వరద పోటెత్తతడంతో...ముంపు మండలాలను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. అత్యవసర సహాయ చర్యలకు చింతూరులో 2 బృందాలు, వీ.ఆర్.పురానికి ఒక సహాయ బృందాన్ని పంపించారు. సహాయక చర్యల్లో అధికారులు సహకరించాలని విపత్తు నిర్వహణశాఖ కోరింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కన్నబాబు కోరారు. బోట్లు, మోటార్ బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణించవద్దని .. నదిలో చేపల వేటకు వెళ్లొద్దని విపత్తు నిర్వహణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం 10.4 అడుగుల మేర ఉంది. 8.6 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి ముంపుప్రాంతాలలో ఇప్పటికే కొన్ని గ్రామాలు జలదిగ్భందంలో ఉన్నాయి. బాధితులు కొండలపై తలదాచుకుంటున్నారు.
పోలవరానికి భారీగా వరద
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టుకు భారీ స్థాయిలో గోదావరి వరద చేరుతోంది. స్పిల్ వే వద్ద 32.8మీటర్ల వద్ద వరద ప్రవాహం ఉంది. కాఫర్ డ్యామ్ వద్ద 34.3 మీటర్లకు నీటి ప్రవాహం చేరింది. పోలవరం బోట్ పాయింట్ వద్ద 23.6 మీటర్ల వద్ద నీరుంది. స్పిల్ వే 48 గేట్ల ద్వారా 8.6 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు కిందకు వదులుతున్నారు. జంగారెడ్డిగూడెం, కేఆర్‌పురంలో సహాయ బృందాలను సిద్ధం చేశారు.