తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రవాహ ఉద్ధృతికి గండిపోశమ్మ ఆలయం జలమయం కాగా.. దర్శనాలు నిలిపివేశారు. వరద భయంతో ఇళ్లను ఖాళీ చేసిన నిర్వాసితులు మైదాన ప్రాంతాలకు తరలివెళ్లారు. పూడిపల్లిలో ఎస్సీ కాలనీ, అంగన్వాడీ కేంద్రం, పాఠశాలల్లోకి వరద నీరు చేరింది. దేవిపట్నం - తొయ్యేరు ఆర్అండ్ బీ రహదారిపై పూర్తిగా వరదనీరు చేరడంతో మంటూరు నుంచి రంపచోడవరంపై రాకపోకలు నిలిచిపోయాయి.
కొండమొదలు పంచాయతీలోని సుమారు 11 గ్రామాల నిర్వాసితులు అక్కడే ఉండిపోయారు. వరద మరింత పెరిగితే... కొండలపై ఉండడానికి తాత్కాలికంగా పాకలు నిర్మించుకున్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, భూసమస్యలు పరిష్కారం కాకపోవడంతో చాలా మంది అక్కడే చిక్కుకుపోయారు.