Hanuman Jayanti: హనుమాన్ జయంతి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలోని భక్తాంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. హనుమాన్ జయంతి రోజున స్వామివారిని దర్శించుకుంటే ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటు శక్తి, సామర్థ్యాలు పెంపొందుతాయని భక్తులు విశ్వసిస్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ పాలకవర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. స్వామివారిని దర్శించుకొనే భక్తులకు అఖండ అన్నసమారాధన ఏర్పాటు చేశారు.
హనుమాన్ జయంతి సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఆంజనేయ స్వామి ఆలయాలతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తణుకులోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి తులసి మాలలు సమర్పించుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో తెల్లవారుజామున 3:30 నిమిషాలకు వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య క్షీరాభిషేకం పంచామృతాలతో కన్నులపండువగా సాగింది. ఆలయ అవరణమంతా జై హనుమాన్ నామస్మరణతో మార్మోగడటంతో అధ్యాత్మిక శోభ సంతరించుకుంది.