తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో వైభవంగా గౌరీ శంకరుల 86వ వార్షిక ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సాంప్రదాయ పద్ధతిలో ప్రతి ఏటా అట్లతద్ది నుంచి సంక్రాంతి వరకు ఈ గ్రామంలో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నెల రోజులపాటు గౌరమ్మ వేషాలు ప్రజారంజకంగా ఆకట్టుకునే విధంగా ఆలోచించే రీతిలో నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ సాంఘిక పౌరాణిక నాటకాల్లోని ఘట్టాలను కళారూపంగా మలిచి గ్రామంలో ప్రదర్శన ఇస్తున్నారు.
ఈ గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి ఏదో వేషం వేసి కళాకారుడు కావడం పరిపాటి. సీతారామ వనవాసం, మాయలేడి, తాటక వధ, రామాంజనేయ యుద్ధం, చాకలి తిప్పడు, సత్యహరిశ్చంద్రలో పలు సన్నివేశాలతో ఈ నెలరోజులు ప్రదర్శనలిస్తారు. ఇదే క్రమంలో మంగళవారం ధర్మవరం కళాకారులు ప్రదర్శించిన శ్రీకృష్ణరాయబారం నాటకంలోని సన్నివేశం విశేషంగా ఆకట్టుకుంది.