ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Innovative teaching: ఆకులు, సబ్బులపై కళారూపాలు.. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధనలు - ఉపాధ్యాయుడు గోవిందరాజులు తాజా వార్తలు

విద్యార్థులకు నల్లబోర్డుపై పాఠాలు చెప్పడం.. సాధారణంగా అందరు ఉపాధ్యాయులు చేసే పని. కానీ ఆ మాస్టారి శైలి మాత్రం కాస్త విభిన్నం. ఆకులు, సబ్బులు, కూరగాయలు, పండ్లపై బొమ్మలు చెక్కి పాఠ్యాంశాలు బోధించడం ఆయన ప్రత్యేకత. తాటాకులతో అల్లికల ద్వారా తోలు బొమ్మలు కూడా రూపొందించి విద్యార్థులతోపాటు గురువులకు సైతం శిక్షణ ఇస్తున్నారు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు గోవిందరాజులు.

govindarajulu innovative teaching at east godavari
ఆకులు, సబ్బులపై కళారూపాలు.. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధనలు

By

Published : Aug 1, 2021, 4:30 PM IST

ఆకులు, సబ్బులపై కళారూపాలు.. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధనలు

ఆకర్షణీయమైన వివిధ కళారూపాలు అలవోకగా చేస్తున్న ఈయన పేరు గోవిందరాజులు. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం జిన్న జగ్గంపేటలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సైన్సు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బొమ్మలు, కళా రూపాలతో బోధించడం ఈ గురువు ప్రత్యేకత. ఆకులు, సబ్బులు, సుద్ద ముక్కలు, కూరగాయలు, పండ్లపై బొమ్మలు చెక్కుతున్నారు. వీటితో పాటు కాగితాలతో బొమ్మలు కూడా తయారు చేస్తున్నారు. ఇలా అపురూపమైన వివిధ కళారూపాలు రూపొందించడంలో గోవిందరాజులు నైపుణ్యం సాధించారు. ఈ విధంగా ఈయన చేతి నుంచి జాలు వారిన బొమ్మలు, కళారూపాలు విద్యార్థులకు పాఠాల కథాంశాలుగా మారిపోయాయి.

సృజనాత్మకతను వెలికి తీసేందుకు..

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు.. వివిధ కళారూపాలతో విద్యా బోధన చేస్తున్నారు గోవిందరాజులు. అదే విధంగా అంతరించిపోతున్న తోలు బొమ్మల కళకు తిరిగి ప్రాణం పోసేందుకు సంకల్పించారు. స్పాంజ్‌తో తోలు బొమ్మలు తయారు చేసి.. వాటి ద్వారా కూడా పాఠాలు చెబుతున్నారు. ఈ విధమైన బోధన ద్వారా.. విద్యార్ధులు సులభంగా అవలోకనం చేసుకుంటారని గోవిందరాజులు చెబుతున్నారు.

విద్యార్థులకు వర్క్ షాపులు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయులు, డైట్ విద్యార్థులకు వర్క్ షాపులు నిర్వహించి బొమ్మలు, వివిధ కళారూపాలు రూపొందించడంపై శిక్షణ ఇస్తున్నారు. గోవిందరాజులు పాఠాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతున్నాయని తోటి ఉపాధ్యాయులు చెబుతున్నారు. గోవిందరాజులు భార్య కూడా ఉపాధ్యాయురాలే. ఆమె కూడా ఆయన్ను ఎంతో ప్రోత్సహిస్తూ.. కళా రూపాల్లో మెళకువలు నేర్చుకుంటున్నారు.

వినూత్న రీతిలో విద్యా బోధన నిర్వహిస్తున్న గోవిందరాజులు.. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డులు అందుకున్నారు. అంతర్జాతీయ ఇన్నోవేటివ్ సైన్స్ ఫేర్ లో గోల్డ్ మెడల్ కూడా ఆయన్ను వరించింది. విద్యార్థులకు సృజనతో పాఠాలు బోధించే గోవిందరాజులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చదవండి:

ఎలా బతికేది.. నలుగురు ఆడపిల్లల్లో ఇద్దరూ అలాంటివారే..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details