ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కళారంగంలో రాణిస్తున్న గోదావరి అమ్మాయి.. ఎన్నెన్నో అవార్డులు - Lakshmi Deepika performances

Kuchipudi Dancer Lakshmidipika: భారతీయ సనాతన సంప్రదాయాలు, కళలను.. నృత్య ప్రదర్శనల ద్వారా ప్రపంచానికి చాటి చెబుతోంది ఆ యువతి. తల్లిదండ్రులే తొలి గురువులుగా ఓనమాలు నేర్చుకొని దేశ, విదేశాల్లో వేలాది ప్రదర్శనలు ఇస్తోంది. ఎంతటి వారినైనా తన నాట్యంతో మంత్రముగ్ధుల్ని చేస్తూ కళారంగంలో సాగిపోతోంది. నిరంతర నృత్య ప్రదర్శనలతో ప్రపంచ రికార్డు నెలకొల్పడమే కాక చదువులోనూ ప్రతిభ కనబరుస్తున్న ఆ యువతిపై ప్రత్యేక కథనం.

Kuchipudi Dancer Lakshmidipika
Kuchipudi Dancer Lakshmidipika

By

Published : Mar 30, 2023, 1:44 PM IST

కళారంగంలో రాణిస్తున్న గోదావరి అమ్మాయి.. ఒకేసారి అన్ని అవార్డులా.. గిన్నిస్‌ బుక్‌ సైతం!

Kuchipudi Dancer Lakshmidipika: చిన్నప్పటి నుంచి నాట్య ప్రపంచంలోనే పెరిగింది. తల్లిదండ్రులు నాట్య గురువులు అవడంతో ఇంట్లో వేరే లోకం లేకుండా ఉండేది. అలా తన 5వ ఏటనే తొలి ప్రదర్శన ఇచ్చి, అందరి మన్ననలు పొందింది. అక్కడితో ఆగిపోకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది ఈ యువతి. కూచిపూడి నృత్యాన్ని లయబద్దంగా ప్రదర్శిస్తున్న ఈ యువతి పేరు గోరుగంతు లక్ష్మీదీపిక. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన ఉమా జయశ్రీ, బ్రహ్మశ్రీ బదరీ నారాయణ దంపతుల కుమార్తె. తండ్రి బదరీనారాయణ ధవళేశ్వరంలో శ్రీ రాధాకృష్ణ సంగీత, నృత్య, కళాక్షేత్రం ఏర్పాటు చేశారు. పాతికేళ్లుగా వేల మంది చిన్నారులు ఈ కళాక్షేత్రంలో నృత్యం నేర్చుకున్నారు. తన తండ్రి రచించిన సంగీత నాట్యామృత సంభవం, సనాతన సంప్రదాయ వైభవం, నక్షత్ర మాలికా చరితం, శ్రీ సాయి మహిమామృతం, అమృత కృష్ణతత్వం, సనాతన గురు వైభవం, శాకుంతలం, నవదుర్గా వైభవం, అష్ట నాయికలు వంటి ఎన్నో రూపాలను అవలీలగా ప్రదర్శించింది దీపిక. తనకు ఈ కళ అబ్బడానికి కారణం తల్లిదండ్రులే అంటోంది దీపిక. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణగా పెంచడంతో పాటు నిత్యం నాట్యానికి సంబంధించిన పాఠాలు బోధించారంటుంది. తనకు ఈ కళ పట్ల ఆసక్తి ఎలా కలిగిందో, తనను వరించిన అవార్డుల గురించి చెబుతోంది ఈ కళాకారిణి.

చిన్న వయస్సులోనే రికార్డులు..లక్ష్మీ దీపిక ఇప్పటి వరకు దేశ విదేశాల్లో సుమారు 2500 ప్రదర్శనలు ఇచ్చింది. గోదావరి మహా పుష్కరాల సమయంలో ఇచ్చిన ప్రదర్శనలకు విశేష స్పందన లభించింది. 2017లో శ్రీ రాధాకృష్ణ సంగీత నృత్య కళాక్షేత్రకు చెందిన 64 మంది విద్యార్థులు.. ఒకే ఆహార్యంతో 12 గంటల 23 నిమిషాల 1 సెకన్ పాటు నిర్విరామ సప్త నృత్య రూపక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తోపాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఒకేసారి కైవసం చేసుకోవడం విశేషం. తాను కేవలం ఈ కళకే పరిమితం కాకుండా చదువుకూ సమ ప్రాధాన్యం కల్పిస్తూ.. అందరి చేత శభాష్‌ అనిపించుకుంటుంది దీపిక.

విద్యలో అద్భుత ప్రతిభ..ఇలా ప్రతిభతో అందర్నీ ఆకట్టుకుంటున్న దీపిక తన కళను తోటి వారికి కూడా నేర్పుతోంది. వారి కళాక్షేత్రంలో శిక్షణ కోసం వచ్చే వారికి పలు సూచనలు చేస్తూ వారందరికీ స్నేహితురాలిగా ఉంటోంది. చిన్న వయస్సులోనే ఇన్ని రికార్డులు సొంతం చేసుకున్న దీపిక తమకు ఆదర్శం అంటున్నారు ఈ విద్యార్థులు. చిన్నప్పుడే సాధన ప్రారంభించి ఈ స్థాయికి చేరుకుందంటున్నారు దీపిక తల్లిదండ్రులు. తనకు తానుగా నేర్చుకుంటూ చాలా సులభంగా విద్యనభ్యసిస్తుందని చెబుతున్నారు. తమ కుమార్తె కళారంగంలో ఇన్ని బహుమతులు గెలుచుకోవడంతో మురిసిపోతున్నారు ఆ దంపతులు. విద్యలో అద్భుత ప్రతిభ కనబరుస్తూనే భారతీయ కళా వైభవాన్ని దశ దిశలా వ్యాప్తి చేస్తోంది ఈ యువతి. సనాతన ధర్మం, సనాతన కళారూపాల్ని ప్రపంచ వ్యాప్తం చేయడానికి కృషి చేస్తున్నలక్ష్మీదీపిక తెలుగురాష్ట్రాల తరఫున నేషనల్ యూత్ అవార్డ్‌కూ నామినేటైంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details