అధిక వర్షాలతో తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ లంక గ్రామాలను గోదావరి చుట్టుముట్టింది. కోనసీమలోని 64 గ్రామాలు వరద ప్రభావానకి గురయ్యాయి. ఇళ్లలోకి వరద చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పూరిళ్లు, పశువుల పాకలు నేలకూలాయి. సురక్షిత ప్రాంతాల నుంచి గ్రామాలకు చేరుకున్న ప్రజలు... ధ్వంసమైన ఇళ్లను చూసి ఆవేదన చెందుతున్నారు. పలుచోట్ల రోడ్లపై గుడారాల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాజ్‌వేలపై వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. వారం రోజులుగా వరద నీటిలోనే పడరాని పాట్లు పడుతున్నారు..
పునరావాస కేంద్రాలకు వెళ్లకుండా ఇళ్లల్లోనే ఉన్న ప్రజలకు నిత్యావసరాలు కరవయ్యాయి. ఎక్కడికక్కడ చిక్కుకున్న మూగజీవాలు పశుగ్రాసం లేక ఆకలితో అలమటిస్తున్నాయి. రోజులు గడుస్తున్నా పరిస్థితులు కుదుటపడకపోవడంతో ప్రాణాలకు తెగించి ప్రైవేటు పడవల్లో నిత్యావసరాలు, పశుగ్రాసం కోసం బయట ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. కరోనా భయంతో పునరావాస కేంద్రాలకు వెళ్లని వారంతా ముంపు చుట్టుముట్టినా నివాసాల్లోనే ఉన్నారు. అధికారులు నీరు మాత్రమే అందిస్తున్నారని.... ఆహారం, నిత్యావసరాల కోసం ఇబ్బందులు తప్పడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పడవలు ఏర్పాటు చేసినా.... అవి ఏ మాత్రం చాలడం లేదంటున్నారు.
గతంలో..వరద ముప్పు పొంచి ఉంటే..అధికారులు ముందస్తుగా సమాచారం ఇచ్చేవారని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేకనే.... అవస్థలు మరింత పెరిగాయంటున్నారు. అధికారులు మాత్రం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతున్నారు. మండలంలో ప్రజా రవాణా కోసం 30 పడవలు ఏర్పాటు చేశామన్నారు.