చుట్టుముట్టిన గోదారమ్మ... భయాందోళనలో లంక గ్రామాలు తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని లంకగ్రామాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయాందోళనతో ఉన్నారు. గోదావరి వరద బడుగువానిలంకను చుట్టుముట్టింది. ఊరిలోకి వెళ్లాలంటే నడుంలోతు నీటి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో వరద వచ్చినప్పుడు నాటు పడవలు ఏర్పాటు చేసేవారని... ప్రస్తుతం ఎటువంటి పడవలను ఏర్పాటు చేయకపోవడంతో బయటకు రాలేని పరిస్థితి నెలకొందని గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామం నుంచి బయటకు వస్తే మళ్లీ వెళ్లే పరిస్థితి లేదంటున్నారు.
నిండా ముంచేసిన వరదలు
లంక ప్రాంతాల్లోని పంటపొలాలు పూర్తిగా నీటమునిగాయి. ఈ ప్రాంతంలో కూరగాయలు తోటలు ఎక్కువగా పండిస్తుంటారు. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టామని.. పంట చేతికందే సమయంలో వరదతో చేతికి రూపాయి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంకలోని పాడి పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రైతులు నడుంలోతు నీటిలో సాహసం చేస్తున్నారు. కరోనాతో నష్టపోయిన తమను గోదావరి ముంపు పూర్తిగా అప్పుల ఊబిలో ముంచేసిందని అన్నదాతలు వాపోతున్నారు.
ప్రభుత్వం పరిహారం అందించి, ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తక్షణం పడవలు ఏర్పాటుచేసి తమను సురక్షితప్రాంతాలకు తరలించాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి :ధవళేశ్వరం వద్ద గోదారి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక