వరదలు మొదలైతే కోనసీమ వాసులకు మొదట గుర్తొచ్చేది 1986 నాటి పరిస్థితి. ఆ భారీ వరదలకు నేటితో 34 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1986 ఆగస్టు 16న అర్ధరాత్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 24.5 ఐదు అడుగుల నీటి మట్టం నమోదయ్యింది. 35,06,388 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. ఈ వరద ధాటికి గోదావరి జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.
తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక వద్ద వశిష్ట ఎడమ ఏటిగట్టు ఏకంగా ఏడు చోట్ల తెగిపోయింది. దీంతో నాగులంక గ్రామం ఛిద్రమైంది. ఈ భారీ వరద ధాటికి రాజోలు, సకినేటిపల్లి, మలికిపురం, మామిడికుదురు మండల్లాలో ప్రజలు 15రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి బిక్కుబిక్కుమంటూ జీవనం గడిపారు.