కేంద్రపాలిత ప్రాంతం యానాంను గోదావరి వరద ముంచెత్తింది. 2006లో వచ్చిన వరద స్థాయిని మించి వరద పోటెత్తుతోంది. డిప్యూటీ కలెక్టర్ కార్యాలయానికి సమీపంలో ఉన్న జెండా స్తంభం వరకు నీరు చేరింది. పర్యటక ప్రాంతాలైన ఫెర్రీ రోడ్డు, రాజీవ్ బీచ్, భారతమాత, జీసస్ విగ్రహాలను వరదనీరు తాకింది.
యానాం ఎదుర్లంక బాలయోగి వారధి వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు. వరద ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న సుమారు 1500 కుటుంబాల పరిస్థితిని పుదుచ్చేరి సీఎం నారాయణస్వామికి స్థానిక ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు వివరించారు. బాధితులను ఆదుకునేందుకు సాయం అందించాలని కోరారు. ఈ వరద ముంపునకు గురవ్వడానికి కారణం లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ అని.. రక్షణ గోడ నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు చేపట్టకుండా అడ్డుకున్నారని ఎమ్మెల్యే విమర్శించారు.