(Grieving farmers) గోదావరి వరదలు రైతులను నిండా ముంచేశాయి. ఉద్యాన పంటలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. లంక గ్రామాల్లోని వేలాది ఎకరాల్లో సాగు చేసిన అరటి, బొప్పాయి, కంద, మొక్కజొన్న, కూరగాయల పంటల్ని వరద సర్వనాశనం చేసింది. వారం, పది రోజులు ఆగితే పంట చేతికొచ్చే దశలో వరద ముంచెత్తి ఆశల్ని చిదిమేసిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నీటి ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతుండటంతో కాస్తో కూస్తో పంటనైనా దక్కించుకుందామని పడవలపై ప్రమాదానికి ఎదురెళుతున్నారు. పక్వానికి రాని అరటి, పూర్తిగా గింజ కట్టని మొక్కజొన్న, చిన్న చిన్న బొప్పాయి కాయలు కోసుకుని ఒడ్డుకు చేరుస్తున్నారు. కానీ ఫలితం దక్కడం లేదు.
కరోనాతో వరుసగా రెండేళ్లు నష్టాలను చవిచూసిన రైతులు ఈ ఏడాది కాస్తా, కూస్తో మిగులుతుందనుకుంటే వరద నట్టేట ముంచేసింది. భూ యజమానులకు ముందుగానే డబ్బులు చెల్లించామని ఇప్పుడు తమ కష్టమంతా నీటిలో కలిసిపోయిందని కౌలు రైతులు(tenent farmers) వాపోతున్నారు. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి అరటి, బొప్పాయి వంటి పంటలు సాగు చేస్తే పూర్తిగా వరద నీటిలో కొట్టుకుపోయిందని గగ్గోలు పెడుతున్నారు. సాహసోపేతంగా వరద నీటిలో ప్రయాణించి తోటల నుంచి పంటను ఒడ్డుకు చేర్చినా మార్కెట్‌లో సరైన ధర దక్కడం లేదని అంటున్నారు.