ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధవళేశ్వరం వద్ద వరద ఉద్ధృతి.. 17 అడుగులు దాటితే మూడో హెచ్చరిక..!! - ధవళేశ్వరం వద్ద వరద ఉద్ధృతి

DHAVALESWARAM: ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలు, వరద ప్రవాహంతో ఉద్ధృతి విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం 16.4 అడుగుల నీటిమట్టం కొనసాగుతుండగా.. వరద ఉద్ధృతి తగ్గకపోతే మూడో ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశమున్నట్లు సమాచారం.

DHAVALESWARAM
DHAVALESWARAM

By

Published : Jul 14, 2022, 11:52 AM IST

Updated : Jul 14, 2022, 10:40 PM IST

ధవళేశ్వరం వద్ద వరద ఉద్ధృతి.. 17 అడుగులు దాటితే మూడో హెచ్చరిక

DHAVALESWARAM: ఎగువన కురుస్తున్న వర్షాలు, వరద ప్రవాహంతో.. గోదావరి నదిలో వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీలోకి 16.42 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. వరద ఉద్ధృతి తగ్గకపోతే మూడో ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశమున్నట్లు సమాచారం. రేపు ధవళేశ్వరం బ్యారేజీకి 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే సూచన ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరో 48 గంటలపాటు ధవళేశ్వరం వద్ద.. గోదావరి వరద ఉద్ధృతి కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ నుంచి వరద ఇంకా వస్తూనే ఉందని.. ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉంటున్నట్లు చెప్పారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం 16.4 అడుగుల మేర నీటిమట్టం ఉండగా.. బ్యారేజ్‌ నుంచి 17.07 లక్షల క్యూసెక్కులు, పంటకాల్వలకు 5 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఏ క్షణమైనా మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.

వరద ఉద్ధృతి పెరిగితే 36 లంక గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని కోనసీమ ఎస్పీ తెలిపారు. సఖినేటిపల్లి, పి.గన్నవరంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, అయినవిల్లి, రామచంద్రాపురంలో ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, రావులపాలెంలో మరో 2 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్దం చేశామన్నారు. పది ఏపీఎస్పీ బెటాలియన్లు, 80 మంది ఏఎన్ఎస్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు.

వరదల పరిస్థితిని స్టేట్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ నుంచి విపత్తుల శాఖ స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్, ఇరిగేషన్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌ పర్యవేక్షిస్తున్నారు. అల్లూరి, కోనసీమ, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కలిపి.. మొత్తం 7 ఎన్డీఆర్ఎఫ్​, 5 ఎస్డీఆర్​ఎఫ్​ బృందాలు క్షేత్రస్థాయి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

తెలంగాణలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుత నీటిమట్టం 63.50 అడుగులకు చేరింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద అధికారులు.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చడంతో తీర ప్రాంతం అతలాకుతలమమవుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడుతూ వచ్చిన వరదపోటు భద్రాద్రిలో ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. నదీపరివాహక ప్రదేశాల్లో భారీ ఎత్తున వరద చేరి భయానక వాతావరణం చోటుచేసుకుంది. ఫలితంగా గోదావరి తీరప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ముంపు బాధితులు ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటుండగా.. ఇళ్ల వద్దే ఉన్న బాధితులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. జులై మొదటిపక్షంలోనే ఈ స్థాయిలో వరదపోటెత్తడం గోదావరి చరిత్రలోనే ఇది రెండోసారి. 1976లో తొలిసారి భద్రాచలం వద్ద 63.9 అడుగుల నీటిమట్టం జూన్ 22న నమోదైంది. ఆ తర్వాత జులై రెండో వారంలో 60 అడుగులు దాటడం ఇదే ప్రథమం.

80 అడుగుల మేర వచ్చినా తట్టుకునేలా..:1986లో గోదావరి వరదలకు భద్రాచలం పట్టణానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఆలయ పరిసరాల్లోని కాలనీలన్నీ నీటమునిగాయి. ఈ సమస్యను గుర్తించిన అప్పటి ప్రభుత్వం కరకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఈ కరకట్టే పట్టణానికి శ్రీరామరక్షగా మారింది. దాదాపు 80 అడుగుల మేర వరద వచ్చినా తట్టుకునేలా కరకట్ట నిర్మాణం చేపట్టినప్పటికీ స్లూయీస్‌ల నిర్మాణంలో లోపాల వల్ల లీకేజీలు తలెత్తేవి. అయితే, చాలా ఏళ్ల తర్వాత మళ్లీ గోదావరి నీటిమట్టం భారీగా పెరగడంతో ఈసారి ఏకంగా వరదనీరు కరకట్టను తాకింది. మొదటి ప్రమాద హెచ్చరిక 43, రెండోప్రమాద హెచ్చరిక 48, మూడో ప్రమాద హెచ్చరిక 53 అడుగులు ఉండగా.. ప్రతీ హెచ్చరికకు మధ్య 5 అడుగుల వ్యత్యాసం ఉంది. మూడో ప్రమాద హెచ్చరిక దాటి 24 గంటలు గడవక ముందే ప్రవాహ ఉద్ధృతి ఏకంగా 8 అడుగులకు మించి పోటెత్తడం గమనార్హం. గంట గంటకూ వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ వచ్చింది. బుధవారం రాత్రి 9 గంటలకు 55.1 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం గురువారం ఉదయానికి 3 అడుగుల మేర పెరిగింది. ఆ తర్వాత వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. బుధవారం 14 లక్షల నుంచి 15 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల కాగా.. గురువారం ఏకంగా 18 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 14, 2022, 10:40 PM IST

ABOUT THE AUTHOR

...view details