ఈ ఖరీఫ్ సీజన్‌లో గోదావరి డెల్టా.. అతలాకుతలమైంది. ఆగస్టులో వచ్చిన వరదల వల్ల ఉభయ గోదావరి జిల్లాలో పంటలు నీట మునిగాయి. ఆ తర్వాత ఎడతెరిపిలేని వర్షాలు వరి పంటను కోలుకోలేని దెబ్బ తీశాయి. రెండు జిల్లాల పరిధిలో డెల్టాలో కోతల సమయంలో వచ్చిన నివర్ తుపాను రైతులకు అపార నష్టం మిగిల్చింది. ఖరీఫ్ పెట్టుబడులు నీటి పాలవ్వడంతో రబీపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో గతనెల 24న రాజమహేంద్రవరంలో ఉభయ గోదావరి జిల్లాల సాగు నీటి సలహా మండలి సమావేశంలో... మార్చి 31 నాటికి డెల్టా కాల్వలు కట్టేయాలని నిర్ణయం తీసుకున్నారు. పోలవరం కాఫర్ డ్యాం నిర్మాణం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల.. రబీలో వరి సాగు ఎలా అన్న సందేహం డెల్టా రైతుల్లో నెలకొంది.
నివర్ తుపాను దెబ్బకు నేల వాలిన పంట కోతలు ఇంకా పూర్తి కాలేదు. కొన్ని ప్రాంతాల్లో కోతలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రబీ నాట్లు పూర్తయ్యేందుకు ఈ నెలాఖరు వరకు సమయం పట్టే అవకాశంఉంది. ప్రభుత్వం 120 రోజుల్లో.. రబీలో వరి పంట పూర్తి చేయాలని గడువు విధించింది. డెల్టాలో రబీ కోతలు ఏప్రిల్ నెలాఖరు వరకు జరుగుతాయి.మార్చి చివర్లో కాల్వలు కట్టేస్తే వేసవిలో నీటి ఎద్దడి తలెత్తి పంటలు నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.