CM YS Jagan mohan Reddy: రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పే వారికి అనుకూల వాతావరణం కల్పించామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో అస్సాగో బయో ఇథనాల్ ప్లాంట్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. కొత్తగా వచ్చే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానిక యువతకే దక్కేలా చట్టం చేసినట్లు పునరుద్ఘాటించారు.
తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మాళ్లదొడ్డిలో అస్సాగో బయో ఇథనాల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. తాడేపల్లి నివాసం నుంచి హెలికాఫ్టర్ లో గుమ్మాళ్లదొడ్డికి చేరుకున్న జగన్... నేరుగా సభా వేదికకు చేరుకున్నారు. అస్సాగో బయో ఇథనాల్ సంస్థకు భూమి పూజ చేశారు. టెక్ మహీంద్ర సీఈఓ పీసీ గుర్నానీ, అస్సాగో ఎండీ అశీష్ గుర్నానీ, ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. 270 కోట్ల రూపాయలతో కాలుష్య రహితంగా, ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. దావోస్ ఆర్థిక సదస్సులో గుర్నానీ తనను కలిసి పరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తి కనబరిచారని చెప్పారు. కేవలం 6 నెలల్లోనే కల సాకారమైందన్నారు.