Ganja Smuggling : రాష్ట్రంలో గంజాయి రవాణాపై నిఘా పెరిగినా.. పరిస్థితుల్లో మార్పు రావటం లేదు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ గంజాయిని.. స్మగ్లర్లు గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. నిన్నా మొన్నటి వరకు పట్టణాలు, మండలాల్లో దొరికిన గంజాయి.. ఇప్పుడు పల్లెల్లో సైతం ఎక్కువ మొత్తంలో పట్టుబడుతుండటంతో.. రాష్ట్రంలో పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట గంజాయి తరలిస్తూ పట్టుబడుతూనే ఉన్నారు. తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో గంజాయి రవాణా చేస్తున్నవారిని తాజాగా పోలీసులు పట్టుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో..
Ganja seized : తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం జాతీయ రహదారిపై.. ప్రైవేటు బస్సులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రాజమహేంద్రవరం నుంచి గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రావెల్ బస్సులో.. రూ.72లక్షల విలువగల 715 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని.. రిమాండ్ నిమిత్తం నిందితులను కొత్తపేట కోర్టుకు తరలిస్తామని పోలీసులు వెల్లడించారు.
కృష్ణా జిల్లాలో..
Ganja seized in krishna : కృష్ణా జిల్లా పామర్రు మండలం కొత్తపెదమద్దాలి బైపాస్ వద్ద.. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులు గుడివాడ, గుడ్లవల్లేరుకు చెందిన వారిగా గుర్తించారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ విద్యార్థులు..
ఓ లాడ్జిలో గంజాయి, ఎల్ఎస్డీ వినియోగిస్తున్న ముగ్గురు విద్యార్థులను గుంటూరు నగరంపాలెం పోలీసులు అరెస్టు చేశారు. బ్రాడీపేట నాలుగో లైనులో ఓ లాడ్జిపై పోలీసులు దాడి చేసి 50 గ్రాముల గంజాయి, 3 ఎల్ఎస్డీ స్ట్రిప్పులను స్వాధీనం చేసుకున్నారు. మరో రూ.8,200 నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్కు చెందిన ముగ్గురు విద్యార్థులు సరదాగా గడుపుదామని వచ్చి.. గంజాయి తాగుతూ పోలీసుల చేతికి చిక్కారు. వీరికి డ్రగ్స్ అమ్ముతున్న హైదరాబాద్కు చెందిన రేవంత్ కోసం పోలీసులు గాలింపు చేబడుతున్నారు. నిందితుల అరెస్టు వివరాలను డీఎస్పీ సుప్రజా మీడియా సమావేశంలో వివరించారు.