ఆది దేవునిగా భక్తుల నుంచి తొలి పూజలందుకునే లంబోదరుడు ఈ ఏడాదీ ప్రజల నుంచి పూజలందుకున్నాడు. అయితే పందిళ్లు, మండపాలు, డీజే హంగామా లాంటివేమీ లేకుండా నిశ్శబ్దంగా ఎవరింట్లో వాళ్లు గణేశుడిని పూజించుకున్నారు. కరోనా ప్రభావంతో ప్రభుత్వం ఆంక్షలు విధించిన వేళ వినాయకుడు ఇళ్లకే పరిమితమయ్యాడు.
సందడి లేని చవితి వల్ల ఆలయాలు, వ్యాపారాలు వెలవెలబోయాయి. ఏటా సందడిగా కనిపించే పూజా సామగ్రి దుకాణాలు, పత్రి అమ్మేవారు, మట్టి గణపతులను విక్రయించేవారు కొనుగోలుదారులు లేక ఉసూరుమన్నారు. ఎవరిళ్లలో వారే పండగ చేసుకున్న కారణంగా.. కొద్దిమొత్తంలోనే పూజా సామగ్రి, పత్రి కొనుగోలు చేశారు.
తూర్పు గోదావరి జిల్లా
జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలు, కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ప్రతి ఏడాది గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ సంవత్సరం ఆ సందడిలేదు. ఎవరికి వారు తమ ఇళ్లల్లోనే చవితి పండుగ చేసుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా
వినాయకచవితి సందర్భంగా జిల్లాలోని ఆదిదేవుని ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా మహమ్మారి నుంచి కాపాడి మంచి రోజులు ప్రసాదించాలని గణేశుని వేడుకున్నారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.
కర్నూలు జిల్లా
కర్నూలులో ప్రజలు చవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయ నుంచి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను దర్శించుకుని పూజలు చేశారు.