కరోనా మృతదేహానికి అంత్యక్రియలు మనుషుల ప్రాణాలు నిర్ధయగా లాగేసుకుంటున్న కరోనా.. మానవత్వాన్నీ మంటగలుపుతోంది. రక్కసితో పోరాడి.. ప్రాణాలు వదిలేస్తున్న వారు.. అందరున్నా అనాథలుగా మట్టిలో కలిసిపోతున్నారు. చివరి చూపు చూసేందుకు సైతం అయినవారు రాకపోవడం... పోలీసులే అన్నీ తామై అంతిమ సంస్కారాలు చేస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామానికి చెందిన వృద్ధురాలు (65)కు కొవిడ్ సోకడం.. ఇంటి వద్దే మందులు వాడుతూ.. ఈనెల 25న మరణించింది. అయితే అంతిమ సంస్కారాలు చేయాల్సిన భర్త, కుమారుడు భయంతో ఇంట్లో నుంచి మాయమయ్యారు. పది కిలో మీటర్ల దూరంలో ఉన్న మరో కుమారుడు కనీసం చివరి చూపు చూసేందుకు రాలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని కారులో ఊరి బయటకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని ఖననం చేసేందుకు గొయ్యి తవ్వడానికి కూడా.. గ్రామస్థులు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు పోలీసులు అటుగా వెళ్తున్న జేసీబీని ఆపి గొయ్యి తవ్వించారు. ఏలేశ్వరానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుల సాయంతో అతి కష్టంమీద సాయంత్రానికి మహిళ మృతదేహం ఖననం చేయించారు.
అయితే పారిశుద్ధ్య కార్మికులు మృతదేహాన్ని తరలించిన తీరు చూస్తే హృదయం ద్రవిస్తుంది. కోవిడ్ వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. భయం, అపోహలు వీడాలని ప్రసారమాద్యమాల్లో నిత్యం అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ కరోనా వైరస్ తో పోరాడి ప్రాణాలు వదిలిన వారి పట్ల.. మనుషులు చూపుతున్న కాఠిన్యం మానవత్వానికే మచ్చగా మిగిలిపోతోంది.
ఇవీ చూడండి...