తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద... గోదావరి పర్యాటక బోటు ప్రమాదంలో గల్లంతైన వారిలో ఇంకా 15 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. బతికే అవకాశాల్లేవు కాబట్టి మరణ ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని బాధిత కుటుంబాలు అధికారులను వేడుకుంటున్నాయి. ఈ ఘటన జరిగి 10 రోజులు దాటినా బోటు వెలికితీత ప్రయత్నాలు ముందుకు కదలడం లేదు.
ఈ నెల 15న గోదావరిలో దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద పర్యటక బోటు మునిగిన ఘటనలో ఇప్పటివరకూ 36 మృతదేహాలే లభ్యమయ్యాయి. 15 మంది పరిస్థితి ఏంటన్నదీ స్పష్టత లేకుండా పోయింది. పదో రోజు పోలవరం మండలం వాడపల్లి వద్ద ఓ మృతదేహం లభ్యమైంది. తొలుత మహిళ మృతదేహంగా భావించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తిగా దెబ్బతిని ఎముకల గూడుగా మారిన ఆ మృతదేహాన్ని గుర్తించలేకపోయారు. చివరకు అది పురుషుడి మృతదేహంగా తేల్చారు.
ఈ పరిస్థితుల్లో కుటుంబసభ్యులు మాత్రం ఇప్పటికీ ఆసుపత్రి వద్ద పడిగాపులు కాస్తున్నారు. అధికారులు బోటు వెలికితీసే ప్రయత్నాన్ని చేయాలని లేదంటే మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరుచేయాలని వేడుకుంటున్నారు.
గతి లేని పరిస్థితిలో కొందరు బాధితులు గల్లంతైన వారి కర్మకాండలు జరిపేస్తున్నారు.
గోదావరి చెంతే కర్మకాండ