తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పాత ఇంజరం గ్రామాల రైతులకు గత ఏడాదిలో వచ్చిన తుఫానులు, వరదల కారణంగా కొబ్బరి చెట్లను కోల్పోయారు. దానికి సంబంధించి రైతులకు నేటికీ పరిహారం అందకపోగా.. గత నెలలో వచ్చిన వరదల కారణంగా మరికొన్ని చెట్లు గోదావరిలో కలిసిపోయాయి. ఈ కారణంగా.. ఉన్న ఆధారం సైతం కోల్పోయారు.
సుమారు కిలోమీటరు పొడవున గౌతమీ, గోదావరిలోకి 500 వరకూ పడిపోయిన కొబ్బరి చెట్లు... రైతు కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. వరద తగ్గుముఖం పట్టి రెండు వారాలు గడిచినా ఇప్పటికీ ఏ ఒక్క అధికారి వచ్చి పరిశీలించిన దాఖలాలు లేవని రైతులు వాపోతున్నారు. ఇక పరిహారం వస్తుందనే ఆశలు కూడా లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో నష్టాన్ని పరిశీలించి తనను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.