కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రజలకు సేవలు అందిస్తున్న వివిధ శాఖల సిబ్బందికి తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆహారం సరఫరా చేస్తోంది. కొత్తపేట నియోజక వర్గంలోని 4 మండలాల్లో పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు నిత్యం ఆయా ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు. వారి కుటుంబాలు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న కారణంగా ఇళ్ల వద్దకు వెళ్లి భోజనాలు చేసే సమయం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి... వీరందరికీ అన్నదాన ట్రస్ట్ తరఫున భోజనం అందించాలని దేవస్థానానికి సూచించారు. ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో 500 మందికి ఆహార పాకెట్లను పంపిణీ చేస్తున్నారు.
అంకంపాలెంలో...
జిల్లాలోని ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో మొబైల్ రైతుబజార్ ను ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ప్రారంభించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్ల వద్దకు కూరగాయలను అందించేలా ఈ ఏర్పాట్లను చేశారు. ప్రజలు ఇంటి వద్దనే ఉండాలని ..మొబైల్ రైతుబజార్ ద్వారానే కూరగాయలను కొనుక్కోవాలని సూచించారు.. గ్రామాల్లో దుకాణాల వద్ద నిత్యావసర సరుకులు ఎక్కువ ధరలకు విక్రయించకుండా అధికారులు చూడాలన్నారు. అధిక ధరలకు విక్రయిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.