ఇచ్చోటనే .. ఇచ్చోటనే .. అంటూ సత్య హరిచంద్ర కాటికాపరి సీన్ ప్రదర్శించే సాంఘిక నాటక కళాకారులు..జెండాపై కపిరాజు...బావా ఎపుడు వచ్చితివీ.. చెల్లియో..చెల్లకో.. అంటూ రాగాలు ఆలపించే పౌరాణిక నాటక కళాకారులు.. వినరా సోదర వీనుల విందుగా ధీరుల గాధలు అంటూ.. చమత్కారాలతో స్వాతంత్ర యోధులకు చరితలు వివరించే బుర్రకథ కళాకారులు...రామా కనవేమిరా... రఘురామ కనవేమిరా అంటూ లయబద్ధంగా అడుగులేస్తూ ఆలపించే హరికథా కళాకారులు.. తెల్లటి తెరవెనుక ఉండి పశువుల చర్మాలతో తయారుచేసిన రంగురంగుల బొమ్మలను చేతులు, కాళ్లతో ఆడిస్తూ పురాణాల గాధలు కళ్ళకు కట్టినట్లు వివరించే తోలుబొమ్మలాట కళాకారులు.. కరోనా మహమ్మారి ప్రభావంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు.. మహమ్మారి బయట పడక ముందు నెలలో 1లేదా 2.. ఏడాదిలో 10 నుండి 15 వరకు ప్రదర్శనలు ఇచ్చే వీరంతా ప్రస్తుతం ఇళ్లకే పరిమితమయ్యారు.. కుటుంబ వారసత్వంగా కొందరు.. జానపద ప్రదర్శనలపై అభిరుచితో మరికొందరు గత కొన్ని ఏళ్లుగా కళనే జీవనాధారంగా చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు.
ప్రదర్శనలు లేని ఆడిటోరియాలు..కళాకారులకు తప్పని పస్తులు - జానపద కళాకారులపై కరోనా ప్రభావం న్యూస్
కళామాతల్లిని నమ్ముకుని.. పొట్ట పోషించుకోవటమే వారికి తెలుసు.. కథలను కళ్లకు కట్టినట్లు చెప్పే వారి కళ్ల వెంట కరోనా కన్నీరు పెట్టిస్తోంది. లాక్డౌన్ దెబ్బకు విలవిల్లాడుతున్న కళాకారులు.. కుటుంబాన్ని పోషించుకోలేక అవస్థలు పడుతున్నారు.
తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలోనూ సుమారు ఐదు వందల జానపద కళాకారుల కుటుంబాలు ఉన్నాయి.. వీరంతా మరే ఇతర పనులకు పోలేక.. ప్రదర్శనలు ఇచ్చే మార్గము లేక ఆదుకునే దాతల కొరకు ఆశగా ఎదురు చూస్తున్నారు..
గతంలో ప్రభుత్వాలు అమలు చేసే పథకాలను గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వివరించేందుకు ఈ కళాకారుల ద్వారా ప్రదర్శనలు ఏర్పాటుచేసి ప్రోత్సహించడంతో పాటు ఆర్థికంగానూ ఆదుకుందని వారు తెలిపారు. తల్లిపాల ఆవశ్యకత.. ఆడపిల్లలను జీవించనివ్వండి చదివించండి.. ఆడపిల్లలపై హత్యాచారాలు చేస్తే విధించే శిక్షలు.. వంటి కార్యక్రమాలను కళా ప్రదర్శన ద్వారా ప్రజల్లోకి తీసుకు వెళ్ళామని ప్రస్తుతం కరోనా ఉద్ధృతి తీవ్ర స్థాయికి చేరడానికి కారణాలు, ప్రజలు అనుసరించాల్సిన మార్గాలను.. కరోనా బారిన పడిన వారికి ధైర్యం కలిగించే విధంగా కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ ప్రదర్శనలు ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.. ఇప్పటికే కనుమరుగవుతున్న జానపద కళా ప్రదర్శనలు.. కరోనా ప్రభావంతో పూర్తిగా మరుగున పడే పరిస్థితులు ఏర్పడతాయని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:అన్నవరం దేవస్థానంలో 40మంది ఉద్యోగులు, సిబ్బందికి కరోనా