ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీడని ముంపు... కొనసాగుతున్న యథాస్థితి

తూర్పుగోదావరి జిల్లాలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో ముంపుకు గురైన పలు గ్రామాలు, పట్టణాల్లో శనివారం కూడా యథాస్థితి కొనసాగింది. పలు చోట్ల తాగునీరు, ఆహారం అందక ప్రజలులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పంట పొలాల్లోంచి నీరు బయటకు వెళ్లే దారిలేక అన్నదాతలు కన్నీరుమున్నీరువుతున్నారు.

floods effect on east godavari district
వీడని ముంపు... కొనసాగుతోన్న యథాస్థితి

By

Published : Oct 18, 2020, 4:11 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఏలేరు వరద ప్రభావంతో ముంపు బారిన పడిన గ్రామాలు, పట్టణాల్లో శనివారం కూడా యథాస్థితి కొనసాగింది. పొలాల్లో నీరు బయటకెళ్లే దారి లేక పరిస్థితి దయనీయంగా మారింది. సముద్రంలోకి ముంపు నీరు వెళ్లడానికి ప్రతిబంధకాలు ఏర్పడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కిర్లంపూడి రాజుపాలెంలో వరి దెబ్బతింది. ఇంద్రపాలెం శ్రీనివాసనగర్‌లో తాగునీటి కోసం జనం ఇక్కట్లు పడుతున్నాారు. కాకినాడలోని సర్పవరం జనచైతన్య లేఅవుట్‌లో వరద ముంపుకు గురైంది. ఇంద్రపాలెంలో నిత్యావసరాల కోసం ప్రజలు యాతన పడుతున్నారు. ఏలేరు జలాశయానికి మళ్లీ వరద పోటెత్తుతోంది. శనివారం రాత్రి 8 గంటలకు చేరిన 12 వేల క్యూసెక్కులనూ దిగువకు వదిలారు.

కచేరీపేటలో వంట చేసేందుకు నానాపాట్లు

●హతవిధీ: కాకినాడ అర్బన్‌, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలులో ముంపు కొనసాగుతోంది. ఇంకా మూడు, నాలుగు రోజులైతేనే సాధారణ పరిస్థితి నెలకొనేది. 2.11 లక్షల మంది ముంపు బారిన పడితే..శనివారానికి 20 శాతమే ముంపు వీడింది. 15,624 మందిని పునరావాస కేంద్రాలకు తరలించగా 50 శాతం మంది ఇళ్లకు వెళ్లిపోయారు.

●కష్టం.. నష్టం: 21,933 ఇళ్లు నీట మునిగాయి. మైనర్‌ ఇరిగేషన్‌కు రూ.45 లక్షలు, గ్రామీణ నీటి సరఫరాకు రూ.5 లక్షలు నష్టం సంభవించింది.

● రైతన్న వేదన: వ్యవసాయ, అనుంబంధ పంటలకు 43,821 హెక్టార్లలో, ఉద్యాన పంటలకు 3,923.9 హెక్టార్లలో నష్టం వాటిల్లింది. రూ.7.65 కోట్ల మేర పెట్టుబడి రాయితీ కోసం ప్రతిపాదించారు.

రాజుపాలెంలో దెబ్బతిన్న వరి చేను

అన్నమో.. రామచంద్ర:కాకినాడలో 26 డివిజన్లలో ముంపు సంభవించగా శనివారానికి 12 డివిజన్లను ఇంకా వీడలేదు. ఏలేరు వరద ప్రభావిత డివిజన్లు.. ఉప్పుటేరు వెంట ఉన్న ప్రాంతాల్లో ముంపు తగ్గలేదు. శనివారం బాధితులకు అరకొరగా.. అదీ మధ్యాహ్నం 2.30 గంటలకు ఆహార పొట్లాలు అందజేశారు. తొలుత పంపిణీ ఆపాలని భావించారు. కార్పొరేటర్ల నుంచి ఒత్తిడి రావడం వల్ల ఇచ్చారు. ముంపులో 6 వేల మంది ఉంటే.. 3,800 పొట్లాలే పంపిణీ చేశారు. ఆదివారం ఒక్కరోజే ప్రభుత్వం తరఫున ఆహారం అందజేయాలని అధికారులు నిర్ణయించారు.

నగరపాలికలో 14 పునరావాస శిబిరాలు పెట్టినా.. అన్నమ్మఘాటీ, అమరావతి నర్సింగ్‌ స్కూల్‌ కేంద్రాలే నడుస్తున్నాయి. ఇందులోనూ 335 మందే ఉన్నారు. చోరీలు, కరోనా నేపథ్యంలో ప్రజలు కేంద్రాలకు రావడం లేదు. కొన్ని డివిజన్లలో ముంపు వీడినా అక్కడి కుటుంబాలు వంట చేసే వసతి లేదు. తమకు రెండు, మూడు రోజులు ఆహారం పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

కాకినాడలోని సర్పవరం జనచైతన్య లేఅవుట్‌లో వరద ముంపు

ముంపులో ఉన్న అందరికీ ఆహారం సరఫరా చేసేలా.. కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేశాం. బాధితులను గుర్తించి.. ముంపు వీడే వరకు ఆహారం అందజేయాలని ఆదేశించాం. కొన్ని ప్రాంతాల్లో ముంపు వీడింది. అవసరమైన చోట సహాయక చర్యలు కొనసాగిస్తాం. -మురళీధర్‌రెడ్డి, జల్లా కలెక్టర్.

అన్నం పెట్టండయ్యా..

నా భర్త, నేను వృద్ధులం. మంగళవారం నుంచి ముంపులోనే ఉన్నాం. ఎలాంటి ఆహారం అందించలేదు. దాతలు పెట్టే అన్నంతో కడుపు నింపుకొంటున్నాం. పునరావాస కేంద్రానికి వెళ్దామంటే కరోనా భయం. మాకు రెండు పూటలా అన్నం పెట్టండయ్యా. -దండిప్రోలు గంగ, వెంకటేశ్వరకాలనీ

దెబ్బతిన్న వరి

ABOUT THE AUTHOR

...view details