తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏలేరు జలాశయానికి 25 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. జలాశయం నుంచి దిగువకు 17 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. కిర్లంపూడి మండలం రాజుపాలెంను వరద నీరు చుట్టుముట్టింది. ముక్కోలు రోడ్డుకు గండికొట్టేందుకు రాజుపాలెం గ్రామస్థుల ప్రయత్నించగా... ముక్కోలు గ్రామస్థులు అడ్డుకున్నారు. రెండు గ్రామాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముక్కోలు వద్ద ముందుజాగ్రత్తగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఏలేరు వరద ఉద్ధృతికి పెద్దాపురం, గొల్లప్రోలు, పిఠాపురంలో వేల ఎకరాల పంటలు నీటమునిగాయి. కిర్లంపూడి, జగపతినగరం, రాజుపాలెం, గొల్లప్రోలులో ఇళ్లు జలమయమయ్యాయి. మెట్టలో కాలువలు, వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రత్తిపాడు-లంపకలోవ రోడ్డుపై సుద్దగెడ్డ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. రాకపోకలు నిలిచాయి.