సుదీర్ఘ విరామం తర్వాత బడి గంట మోగింది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో ఈ రోజు 9, 10 తరగతి విద్యార్థులకు సంబంధించి 18 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. నియోజకవర్గం మొత్తం మీద ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 41, ప్రైవేటు ఉన్నత పాఠశాలు 15 వరకు ఉన్నాయి. వీటిలో 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులు సుమారు 6500 మంది ఉంటారు. వీరిలో 18 శాతం మంది విద్యార్థులు మాత్రమే తొలిరోజు పాఠశాలకు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు.. కొవిడ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు. తరగతి గదుల్లో కొవిడ్ నిబంధనల మేరకు విద్యార్థులు కూర్చునేలా ఏర్పాట్లు చేసి.. తరగతులు నిర్వహించారు.
అయితే కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేసేందుకు సుముఖత చూపలేదు. దీంతో విద్యార్థుల నుంచి అభిప్రాయం తీసుకుని మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేయాలని పి. గన్నవరం మండల విద్యాశాఖ అధికారిణి కోన హెలీనా సూచించారు.