తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెల్లా గ్రామ శివారులో ఏం జరిగిందో తెలీదు... అర్ధరాత్రి పొలాల్లో మంటలు చెలరేగాయి. తొమ్మిది ఎకరాల ధాన్యం రాశులు అగ్నికి ఆహుతి కావడం సహా మూడు పశువుల పాకలకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది పశువులు సజీవదహనం కాగా... ఆరు మూగజీవాలకు తీవ్ర గాయాలయ్యాయి. కన్న బిడ్డల్లా చూసుకున్న మూగ ప్రాణాలు మంటల్లో చిక్కుకొని సజీవ దహనం కావడంపై గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
తూర్పుగోదావరిలో విషాదం: అగ్నికి ఆహుతైన 8 మూగజీవులు - fire accident at east godavari district
అదో... అందమైన గ్రామం. పచ్చటి పొలాలు, పశు సంపద, పాడిపంటలతో.. ప్రశాంత వాతావరణం. అలాంటి వాతావరణంలో ఒక్కసారిగా అలజడి. ఎటు చూసిన మంటలు.. పశువుల ఆర్తనాదాలు. ఏమైందో తెలుసుకునేంతలోనే నోరు తెరిచి బాధ చెప్పుకోలేని మూగ జీవులు అగ్నికి ఆహుతయ్యాయి. మరికొన్ని చర్మం కాలిపోయి విలపించాయి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెల్లా గ్రామ శివారులో హృదయ విదాకర సంఘటన వివరాలివి..!
అగ్నికి ఆహుతైన 8 మూగజీవులు
ఎమ్మెల్యే పరామర్శ
సంఘటనా స్థలానికి రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చేరుకొని పరిశీలించారు. మూగ జీవాలు మంటల్లో కాలిపోవడంపై తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ప్రభుత్వం నుంచి రైతులకు చేయాల్సిన సాయమంతా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ దుర్ఘటన ఎలా జరిగిందనే దానిపై.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాగులో తమకు చేదోడు వాదోడుగా ఉన్న పశువులను.. కోల్పోయిన బాధితులను.. ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.