ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

THREE DEAD: కనురెప్పలు దూరమై...కన్నీటి ఉప్పెనై...! - korukonda incident latest updates

బిడ్డను విగతజీవిగా చూసి ఓ తల్లి మనసు తల్లడిల్లిపోయింది. కుమారుడితో పాటూ తానూ చనిపోతానంటూ పరుగులు తీసింది. ఇద్దరు పిల్లలను కోల్పోయి.. కంటి వెలుగు దూరమై మరో తండ్రి వేదన వర్ణనాతీతం. కనపడటం లేదు... వస్తారేమో... ఎక్కడైనా ఉన్నారేమో అన్న ఆ తల్లిదండ్రుల్లో దాగి ఉన్న చిన్న ఆశ అడియాసే అయ్యింది. పిల్లల మృతదేహాలను చూసిన వారి గుండెలు పగిలిపోయాయి.

ముగ్గురు మృతి
ముగ్గురు మృతి

By

Published : Jun 30, 2021, 7:37 AM IST

బావిలో పడి ముగ్గురు మృతి

కోరుకొండ మండలంలో సోమవారం జరిగిన బావి ప్రమాదం చివరికి తీవ్ర విషాదాన్నే నింపింది. బూరుగుపూడి-దోసకాయలపల్లి మధ్య పొలాల్లోని వ్యవసాయ బావిలో పడి ముగ్గురు పిల్లలు గల్లంతైన సంఘటన విదితమే. ఈ ఘటనలో చిన్నం వీర్రాజు(17), చిన్నం శిరీష(13), గుమ్మడి సునీల్‌(17) మృత్యువాత పడ్డారు. వీరి మృతదేహాలను మంగళవారం బావి నుంచి వెలికితీశారు.


20 గంటలపాటు గాలింపు

బావిలో గల్లంతైన వారి కోసం సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు సుమారు 20 గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది మంగళవారం గాలింపు మొదలుపెట్టారు. మోటార్ల ద్వారా బావిలో నీటిని తోడటంతో పని సులువయింది. మధ్యాహ్నం తొలుత చిన్నం శిరీష, గుమ్మడి సునీల్‌ మృతదేహాలను, ఆ తర్వాత చిన్నం వీర్రాజు మృతదేహాన్ని వెలికితీశారు.

బావి యజమానిపై కేసు

బావి ఉన్న తోట యజమానిపై కేసు నమోదు చేసినట్లు సీఐ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బావి ప్రమాదకరంగా ఉన్నా నిర్లక్ష్యం వహించి, ప్రమాదానికి కారణం కావడంతో ఆ వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తామన్నారు. అందివచ్చిన పిల్లలను పోగొట్టుకుని పుట్టెడు కష్టంలో ఉన్న పేద కుటుంబాలను ఆదుకోవాలని సీఎంకు విన్నవించినట్లు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చెప్పారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి పంపానన్నారు.


వేడుక ఇంట విషాదం

ఇద్దరు బిడ్డలు వీర్రాజు, శిరీషలను పోగొట్టుకున్న చిన్నం వెంకటరమణ దంపతుల రోదన చూపరులను కంటతడి పెట్టించింది. గుమ్ములూరులో శిరీష పుష్పవతి వేడుక ఈ ఏడాది ఫిబ్రవరి 14న జరిగింది. నాలుగు నెలల క్రితం బంధువులు, స్నేహితులతో కళకళలాడిన ఆ ఇంట నేడు విషాదం నిండింది. శిరీష మృతిచెందడంతో ఆ వేడుకను గుర్తుతెచ్చుకుని బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు.

గొప్పోడవుతావనుకుంటే...

చదువుకుని గొప్పోడవుతావనుకున్నాను... ఇలా మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా అంటూ కుమారుడు సునీల్‌ మృతదేహం చూసి గుమ్మడి శేఖర్, భార్య లలిత పద్మకుమారి దంపతుల కళ్లు కన్నీటి సంద్రమయ్యాయి. నువ్వు లేకపోతే నేను బావిలో దూకి చచ్చిపోతా అంటూ పరుగులు పెడుతున్న తల్లిని, కిందపడి ఏడుస్తున్న శేఖర్‌ను బంధువులు దగ్గరకు చేర్చుకుని ఓదార్చారు.


ఇదీ చదవండి:

దారికాచిన మృత్యుబావి.. ముగ్గురి మృతి

ABOUT THE AUTHOR

...view details