తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం రాపర్తి గ్రామ పరిధిలోని గొర్రిఖండి కాలువ గట్టును తవ్వి అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా మంగళవారం గ్రామీణ పోలీసుస్టేషన్ ఎదుట పలువురు రైతులు నేలపై పడుకుని నిరసన తెలిపారు. అనంతరం పిఠాపురం తహసీల్దారు వరహాలయ్య కాళ్ల మీద పడి వేడుకున్నారు.
'గొర్రిఖండి గట్టు తవ్వేస్తున్నారని ఇటీవల రెవెన్యూ, పోలీసు, జల వనరులశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాం. ఒక జేసీబీ, రెండు ట్రాక్టర్లను పోలీసులకు అప్పగిస్తే రాజకీయ ఒత్తిడితో కేసు నమోదు చేయకుండా వదిలేశారు. ఈ తవ్వకాలవల్ల వరదలకు మా గ్రామం ముంపు బారిన పడుతుంది. పొలాలు చెరువుల్లా మారతాయి. పోలీసుల వద్దకు వెళ్తే రెవెన్యూ, జల వనరులశాఖలదే బాధ్యతని.. రెవెన్యూ అధికారులకు చెబితే పోలీసులే కేసులు నమోదు చేయాలని అంటున్నారు. రెండు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు'- రైతుల ఆవేదన’