చెరువుల్లా మారిన పొలాలు... వేల ఎకరాల్లో పంట నీటి పాలు - farmers
గోదావరి నది ఉద్ధృత ప్రవాహానికి తూర్పుగోదావరి జిల్లాలోని మన్యంతోపాటు కోనసీమ భయభ్రాంతులకు గురైంది. ఆదివారం నుంచి గోదావరి శాంతించినప్పటికీ వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు చక్కబడటానికి చాలా సమయం పడుతుంది. చేతికందే సమయంలో వేల ఎకరాల్లో పంట నష్టపోయి రైతులు ఆవేదనకు గురవతున్నారు.
గోదావరి నది వరద ప్రవాహం కారణంగా తూర్పు గోదావరి జిల్లాలో వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. కోనసీమలోని అన్నదాతలకు గోదారమ్మ ఉగ్ర ప్రవాహం తీరని కష్టం మిగిల్చింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 15లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేయటంతో... దిగువ ప్రాంతాల్లోని పంట చేలు చెరువులను తలపించాయి. తొలకరిలో వేసిన వరితోపాటు ఉద్యానపంటలు సైతం వరద ముంపులో మునిగిపోయాయి. అమలాపురం డివిజన్లోని అత్యధిక ప్రాంతాలు రోజుల తరబడి వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. దీనివల్ల అన్ని రకాల కూరగాయల పంటలు నీటిపాలయ్యాయి.
పి.గన్నవరం మండలం ఊడుమూడి లంక, బూరుగుల లంక పరిసర ప్రాంతాల లంకల్లోని పంటలకు అపార నష్టం వాటిల్లింది. పది రోజుల వేగవంతమైన నదీ ప్రవాహానికి... బెండ, వంగ, అనప పాదులు వరదలో తేలియాడాయి. వేల రూపాయలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన పంట... చేతికందే సమయానికి నీటి పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ముంపుతో నష్టపోయిన తమకు ప్రభుత్వం సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గోదావరి ప్రకోపంతో ప్రతి సంవత్సరం నష్టపోతున్నామని కోనసీమ రైతులు వాపోతున్నారు. నష్టపోయిన పంటకు అధికారులు, ప్రజాప్రతినిధులు పరిహారం అందించి ఆదుకుంటే తప్ప కోలుకునే పరిస్థితి లేదంటున్నారు.