గుర్రపుడెక్కతో పంట కాలువలకు చేరని నీరు
ముమ్మిడివరం నియోజకవర్గంలో 50 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తుంటారు. ఆ మెత్తానికి పంట కాలువల ద్వారా వచ్చే నీరే దిక్కు. నాలుగు మండలాల్లో 45 కిలోమీటర్ల మేర బ్రాంచ్ కాలువలు ఉన్నాయి. అందులో మొత్తం గుర్రపు డెక్క పేరుకుపోవటంతో రైతులకు నీరందక అవస్థలు పడుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్ళరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లో సుమారు 50 వేల ఎకరాలలో వరి సాగు చేస్తున్నారు. దీనికి పంట కాలువ ద్వారానే నీరు అందవలసి ఉంది. ఈ నాలుగు మండలాలలో 45 కిలోమీటర్ల మేర బ్రాంచ్ కాలువలు ఉన్నాయి. ప్రతి ఏటా 'నీరు-చెట్టు' కార్యక్రమం ద్వారా వేసవిలో ఉపాధి కూలీల ద్వారా పంట కాలువలో పూడికతీత తీసి.. చెత్తను తొలగించి ఖరీఫ్ సీజన్ నాటికి నీరందేలా చేసేవారు. ఈ ఏడాది ఎన్నికల వల్ల ఈ పనులు చేపట్టకపోవడంతో పంట కాలువలన్నీ గుర్రపుడెక్క, ఇతర వ్యర్ధాలతోనిండిపోయాయి. కాలువలకు నీరు వదిలి నెల గడుస్తున్నా రైతు చేనుకు నీరు అందడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువలోని పూడికను.. గుర్రపు డెక్కను తొలగించాలని రైతులు కోరుతున్నారు. ఈ నెలలో అధిక వర్షాలతో గోదావరి నది పాయలకు వరదలు సంభవించే అవకాశం ఉన్నందునా.. అధికారులు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.