భూమి పంపకంలో కుటుంబ కలహాలే శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన ఊటూకురి వీరబాబు హత్యకు కారణమని అదనపు ఎస్పీ కరణం కుమార్ తెలిపారు. ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను పెద్దాపురం డీఎస్పీ ఏ.శ్రీనివాసరావు, తుని సీఐ రమేష్‌బాబుతో కలిసి తెలిపారు. గ్రామానికి చెందిన గుండుబిల్లి చంద్రరావుకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. ఒక కుమార్తె లక్ష్మిని, వీరబాబు వివాహం చేసుకున్నాడు. గ్రామ శివారున 2010లో కొనుగోలు చేసిన 84 సెంట్లు భూమిలో 42 సెంట్లు మృతుడి భార్య గని లక్ష్మి పేరిట, మిగిలిన 42 సెంట్లు భూమిని 2014లో ఇద్దరు కుమార్తెలకు గిఫ్ట్ డీడ్‌గా చంద్రరావు రాశారు. ఆ తర్వాత ఇద్దరు కుమార్తెల్లో ఒకరు తన వాటాను వీరబాబు భార్యకు అమ్మేసిందన్నారు. దీనిపై చంద్రరావు కుమారులు గుండుబిల్లి సత్యనారాయణ, నానాజీలు తన బావ వీరబాబుతో చాలాసార్లు గొడవపడ్డారు.
ఈ పరిస్థితుల్లో తాను రాసిన గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేయాలని చంద్రరావు న్యాయస్థానంలో కేసు వేశారని చెప్పారు. డ్వాక్రా సొమ్ములో అవకతవకలకు పాల్పడ్డారని మృతుడి భార్య, కుమార్తెలు గొడవపడి నిందితుల భార్యలపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. దీంతో సత్యనారాయణ, నానాజీ పథకం ప్రకారం మారణాయుధాలతో మాటేసి బావ వీరబాబు అన్నవరం వస్తుండగా దాడి చేసి హత్య చేశారన్నారు. ఈ కేసులో నిందితులు సత్యనారాయణ, నానాజీ పాత్ర ఉందని రుజువైందన్నారు. వీరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మిగిలిన పది మంది పాత్రపై విచారించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ వివరించారు.