ఉద్ధృతంగా దేవీపట్నం గోదావరి... ఆందోళనలో ముంపు గ్రామాలు ప్రజలు - water rising in godavari devipatnam
దేవిపట్నంలో గోదావరి పోటెత్తింది. కె.వీరవరం, తొయ్యేరు వద్ద రహదారి నీటితో మునిగిపోయింది. దీంతో ముంపు గ్రామల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వీరిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు రంపచోడవరం సబ్ కలెక్టర్ ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు.
తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవి పట్నం గోదావరి పోటెత్తింది. గోదావరి పోటెత్తడంతో గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మండలంలో కె వీరవరం, తొయ్యేరు జూనియర్ కాలేజీ దగ్గర ఆర్అండ్బీ రహదారి జల దిగ్బంధం అయింది. అలాగే సీతపల్లి వాగు పొంగడంతో దండంగి వాగు కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతం నుంచి గోదావరిలోకి నీరు భారీగా చేరడంతో పలు రహదారులు నిండుకుండలా మారాయి. గోదావరి వరద ఉద్ధృతితో ముందుగా ముంపునకు గురయ్యే దేవీపట్నంతో పాటు తొయ్యేరు, వీరవరం గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో జీవనం సాగిస్తున్నారు. వీరిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు రంపచోడవరం సబ్ కలెక్టర్ , ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు.