కరోనా పేరుతో తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో సాధారణ రోగులకు వైద్య సేవలు అందించడంలో.. ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అరకు పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్ వంతల రాజేశ్వరి ఆరోపించారు. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో వైద్య సేవలు అందక రోగులు పడుతున్న ఇబ్బందులపై.. మీడియాతో మాట్లాడారు. సాధారణ వ్యాధులు, జ్వరాలతో ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న రోగులను చూడకుండా.. కాకినాడ, రాజమహేంద్రవరం వెళ్లాలని డాక్టర్లు సూచించడం దారుణమన్నారు.
రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ లో సరైన వైద్యసేవలు అందించడం లేదని మండిపడ్డారు. ఆక్సిజన్ లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొవిడ్ పరీక్షలు చేయించుకున్న వారికి పాజిటివ్ వస్తే.. కనీసం మందుల కిట్లు ఇవ్వలేని పరిస్థితి ఏజెన్సీలో నెలకొందని దుయ్యబట్టారు.