సంక్రాంతి పర్వదినాల్లో చివరి రోజైన కనుమ నాడు నిర్వహించే ప్రభల ఉత్సవాలకు తూర్పు గోదావరి జిల్లా కోనసీమ పెట్టింది పేరు. ఇక్కడి ప్రబల తీర్థాలకు 400 సంవత్సరాల పైబడి చరిత్ర ఉంది. కోనసీమలోని వివిధ గ్రామాల కూడలిలో కనుమ రోజు నిర్వహించే ప్రభలతీర్థాలకు ప్రజలు భారీగా తరలి వెళతారు. ప్రభలతీర్థాలు కోసం రెండు రోజులుగా నిర్వాహకులు వీటిని ముస్తాబు చేస్తున్నారు. రంగురంగుల వస్త్రాలతో అలంకరించి వీటిని తయారుచేస్తున్నారు. అదేవిధంగా ఎడ్ల బండ్లను ముస్తాబు చేస్తున్నారు.
కనుమ రోజు వీటిని తీర్థ ప్రదేశాలకు తరలించే సుందర ఘట్టం వీక్షించేందుకు రెండు కళ్ళు సరిపోవు. అంత వైభవోపేతంగా ప్రభల ఉత్సవం కోనసీమలో కొనసాగుతుంది. అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో నిర్వహించే ప్రభల తీర్థం కోనసీమలో అతిపెద్దది. ఈ తీర్థంలో వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వీరభద్రుడిని కొలుస్తూ శరభ శరభ అంటూ కనుమ రోజు ప్రభలను తీర్థ ప్రదేశాలకు తీసుకెళతారు.