మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు చేపడతామని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ. మోహన్ రావు హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు పోలీస్స్టేషన్లో సాధారణ తనిఖీలు చేసిన ఆయన... మహిళల రక్షణ కొరకు దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఆపద సమయంలో వారికి సహాయం చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులోకి తెచ్చామన్నారు.
గతేడాది కంటే ఈ ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్న డీఐజీ.. ఇటీవలి కాలంలో ఆన్లైన్ మోసాలు ఎక్కువయ్యాయన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు.. ఓటీపీ నంబర్ అపరిచితులకు వెల్లడించవద్దని చెప్పారు. ఆన్లైన్ మైక్రో ఫైనాన్స్ ఉచ్చులో ఎవరూ పడొద్దని సూచించారు. పండుగల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే.. ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని చెప్పారు.