ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రక్షణ కల్పించాల్సిన వారే...రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు' - తూర్పుగోదావరి జిల్లాలో పోలీసుల పనితీరు

తూర్పుగోదావరి జిల్లాలో పోలీసుల పనితీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు విమర్శల పాలవుతున్నాయి. బాధితుల పక్షాన నిలవని పోలీసుల వ్యవహార శైలి తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఉన్నతాధికారులు చర్యలు చేపట్టడంతో సస్పెన్షన్లు, వీఆర్‌లోకి చేరుకుంటున్నారు.

రక్షణ కల్పించాల్సిన వారే...రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు !
రక్షణ కల్పించాల్సిన వారే...రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు !

By

Published : Jul 28, 2020, 3:25 PM IST

కరోనా లాక్‌డౌన్‌ సమయం నుంచి పోలీసులు బాధ్యతలు నిర్వర్తించడంలో ముందు వరుసలో ఉన్నారు. ప్రజల నుంచి ప్రసంశలు సైతం అందుకున్నారు. ఇదే సమయంలో కొంతమంది వ్యవహరిస్తున్న తీరు, తీసుకున్న నిర్ణయాలు జిల్లాలో తీవ్ర సంచలనం కలిగించాయి. వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలు దుమారాలు రేపాయి. వీటిలో సీతానగరం ఎస్సై ఫిరోజ్‌ ఎస్సీ యువకుడికి శిరోముండనం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించింది. ఈ కేసులో ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఎస్సై ఫిరోజ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.

ఏలేశ్వరం న్యాయవాది పైలా సుభాష్‌చంద్రబోస్‌ అక్రమ నిర్భంధం కేసులో పోలీసులు వ్యవహరించిన తీరులో ఏకంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో జిల్లా ఎస్పీ నయీంఅస్మీ హైకోర్టుకు హాజరయ్యారు. ఆ సమయంలో రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా ఉందా లేదా అని హైకోర్టు ప్రశ్నించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. ఈ ఘటనలోనూ ఇద్దరు ఎస్సైలపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఏలేశ్వరం ఎస్సై సుధాకర్‌, రాజమహేంద్రవరం 3టౌన్‌ ఎస్సై హరిబాబును కూడా ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహన్‌రావు సస్పెండ్‌ చేశారు.

జిల్లాలో నెల రోజుల్లోనే 6గురు ఎస్సైలు సస్పెన్షన్‌కు గురయ్యారు. నకిలీ డీఎస్పీ ద్వారా వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటనలో సీతానగరం ఎస్సై ఆనందకుమార్‌పై వేటు వేశారు. ముమ్మిడివరంలో యువకుడు అదృశ్యం కేసులో అలసత్వం ప్రదర్శించిన ఎస్సై పండుదొరపై చర్యలు తీసుకున్నారు. ఇటీవల గండేపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ను డబ్బులు తీసుకుని వదిలేసిన కేసులో గండేపల్లి ఎస్సై తిరుపతిరావు, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తూ డీఐజీ ఆదేశాలు జారీ చేశారు.

రంపచోడవరంలో పేకాట కేసులో అవినీతికి పాల్పడిన రంపచోడవరం సీఐ వెంకటేశ్వర్లు, ఇద్దరు కానిస్టేబుళ్లను కూడా సస్పెండ్‌ చేశారు. పిఠాపురం సీఐ అప్పారావు, అమలాపురం గ్రామీణ సీఐ భీమరాజు, ప్రత్తిపాడు సీఐ సన్యాసిరావు, కాకినాడ మెరైన్‌ సీఐ భాస్కరరావులను వీఆర్‌కు పంపించారు. బాధ్యతగా పని చేయాల్సిన అధికారులు ఇలా బరితెగించటంపై సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రక్షణ కల్పించాల్సిన వారే...రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారని మండిపడుతున్నారు.

ఇదీచదవండి

ప్రభుత్వం ఇసుకని అందుబాటులో ఉంచాలి: క్రెడాయ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details