తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ఎంపీపీ ఎన్నిక వేళ ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ముందు నుంచే అవగాహనతో పోటీకి వెళ్లిన తెదేపా- జనసేన మధ్య తొలి రెండున్నరేళ్లు పీఠం మాదంటే.. మాదనే మాట పట్టింపులు.. వ్యవహారం ఎటూ తేలక సమావేశానికి ఇరు పార్టీలూ గైర్హాజరయ్యాయి. దీంతో కోరం లేక ఎన్నికల అధికారి ప్రక్రియను వాయిదా వేశారు. వైకాపా, బీఎస్పీ అభ్యర్థులు హాజరైనా ఫలితం లేకపోయింది. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప, జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ జోక్యంతో ఇరు పార్టీల శ్రేణుల్లో సయోధ్య కుదిరినట్లు సమాచారం. మొదటి రెండేళ్లు తెదేపా, తర్వాత వ΄డేళ్లు జనసేన అభ్యర్థి ఎంపీపీ పీఠం ఎక్కేలా ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెదేపా ఎంపీపీగా ముంగండ ఎంపీటీసీ సభ్యురాలు అంబటి భూలక్ష్మి పేరు వినిపిస్తోంది.
మిత్ర లాభం...
రాజోలు: అయిదుగురు జనసేన, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో తెదేపా అభ్యర్థి కేతా శ్రీనివాసరావు ఎంపీపీ అయ్యారు. మిత్రలాభం కలిసొచ్చి వైస్ ఎంపీపీగా జనసేన అభ్యర్థి ఆనందరాజు, కో-ఆప్టెడ్‌గా తెదేపా నుంచి షేక్ ఇస్మాయిల్ ఎన్నికయ్యారు. చింతపల్లి-1 అభ్యర్థి (వైకాపా) గైర్హాజరవడం చర్చనీయాంశమైంది.
ఫిరాయింపుతో...
జనసేన- తెదేపా పొత్తు ఫలించకపోవడం.. ఎన్నిక వేళ తెదేపా పెనికేరు ఎంపీటీసీ సభ్యురాలు స్వాతి వైకాపాకు ఓటేసి.. తర్వాత ఆ పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది. దీనిని ముందే పసిగట్టి ఈ ఎన్నికల సమావేశాన్ని తెదేపా అభ్యర్థులు బహిష్కరించారు. దీంతో చొప్పెళ్ల-2 ఎంపీటీసీ సభ్యుడు లక్ష్మణ రావుకు పీఠం వరించింది.
కూటమిదే.. పీఠం
కడియం: ఉత్కంఠ నడుమ జనసేన- తెదేపా కూటమి ఎంపీపీ పీఠం దక్కించుకుంది. ఉదయం నుంచి భారీగా పోలీసులు మోహరించి అప్రమత్తం అయ్యారు. తెదేపా- జనసేన ఒప్పందం ప్రకారం ఎంపీపీగా కడియం-2 తెదేపా ఎంపీటీసీ సభ్యుడు వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ ఎన్నికయ్యారు. ఈ కూటమికి 12 ఓట్లు దక్కితే.. వైకాపా ఎంపీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల వీర్రాజుకు తొమ్మిది మంది మద్దతే దక్కింది.
బి-ఫారం పొందిన అభ్యర్థుల పార్టీ సంఖ్యా బలం ఆధారంగా ఎన్నిక నిర్వహించాలని వైౖకాపా జేగురుపాడు-1 ఎంపీటీసీ ఆకుల సుధాకర్ డిమాండ్ చేసినా.. ఎన్నికల అధికారి పరిగణనలోకి
తీసుకోలేదు.
ఉపాధ్యక్ష ఎన్నికలో రగడ..
అయినవిల్లి: స్వతంత్ర అభ్యర్థి బలం వైకాపాకు తోడవడంతో పీఠం సునాయాసంగా నాగ విజయలక్ష్మికి దక్కింది. నల్లచెరువు- ఎన్‌పెదపాలెం సభ్యుడు వెంకట రామారావుకు ఉపాధ్యక్ష పదవి ఇస్తామని.. చివరికి అయినవిల్లి సభ్యుడు చిన్నబాబుకు ఇవ్వడంతో వైకాపాలో రగడ చోటుచేసుకుంది. పార్టీకి, ఎంపీటీసీకి రాజీనామా చేస్తానని.. తనను అవమానించారని ఆయన వాపోయారు.
లాటరీతో వరించిన పదవి..
వీఆర్‌పురం: మండలంలో వైకాపా, తెదేపా- సీపీఎం కూటమి బలం సమానం కావడంతో ఇక్కడా లాటరీ అనివార్యమైంది. దీంతో ఎంపీపీ పీఠం సీపీఎం అభ్యర్థి కారం లక్ష్మికి, ఉపాధ్యక్ష పదవి వైకాపా అభ్యర్థి ముత్యాల భవానీకి దక్కింది.
మలికిపురం: ఇక్కడ బలాలు సమానంగా ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. జనసేన అభ్యర్థి రామరాజులంక ఎంపీటీసీ అభ్యర్థి మేడిచర్ల వెంకట సత్యవాణి ఎంపీపీ అయ్యారు. వైస్ ఎంపీపీ పీఠం తెదేపా అభ్యర్థి గుబ్బలపాలెం ఎంపీటీసీ కందికట్ల నిర్మలకు లాటరీతోనే వరించింది.