ఆరుగాలం శ్రమించిన రైతు కష్టం ఈ ఏడాది గోదావరి పాలైంది. గతేడాది మిగిల్చిన నష్టం నుంచి పూర్తిగా కోలుకోక ముందే వరదలు మరోసారి రైతు వెన్ను విరిచాయి. పంట చేతికందే సమయానికి వరదలు పోటెత్తడంతో అవన్నీ ఎందుకు పనికిరాకుండా పోయాయి. రూపాయి, రూపాయీ కూడబెట్టుకుని పెట్టిన పెట్టుబడంతా వరదపాలైంది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విపరీతంగా పంట నష్టం రావటంతో వేలాది రైతులు ఆవేదన చెందుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురం, రావులపాలెం, ఆలమూరు, కొత్తపేట, పి.గన్నవరం, అయినవిల్లి తదితర ప్రాంతాల్లో ప్రజల జీవనాధారం పంటలే. అరటి, కంద, కూరగాయలు, పత్తి సహా పూలసాగూ చేస్తుంటారు. పొలాల్లో వరదనీరు వారానికిపైగా నిల్వ ఉండిపోవటంతో పంట అంతా నాశనమైందని రైతులు బాధపడుతున్నారు. జిల్లాలో దాదాపు 3వేల 900 హెక్టార్ల అరటి, 2 వేల 900 హెక్టార్ల కూరగాయలు, 3వేల 600 హెక్టార్ల వరి దెబ్బతినటంతో 22 వేల మందికి పైగా రైతులు నష్టపోయారు.