పది రోజుల కిందట కరోనా బారిన పడిన తూర్పుగోదావరి జిల్లా మండపేట ఎమ్మెల్యే హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నియోజకవర్గ ప్రజలందరి ఆశీస్సులతో తాను కోలుకున్నట్లు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి ఓ వీడియో విడుదల చేశారు.
వారందరికీ రుణపడి ఉంటా: ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు - మండపేట ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
తాను కొవిడ్ నుంచి కోలుకోవాలని ఆకాంక్షించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు తూర్పుగోదావరి జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు. పది రోజుల కిందట ఆయన కొవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తన ఆరోగ్యం కోసం మసీదులు, చర్చ్ లు, దేవాలయాల్లో పూజలు చేసిన వారందరికీ జీవితాంతం రుణపడి వుంటానన్నారు. నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి పలువురు వాట్సాప్ ల ద్వారా తన క్షేమాన్ని ఆకాంక్షించారని.... వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. తనకు ప్రస్తుతం కరోనా పరీక్షలు జరపగా నెగిటివ్ వచ్చిందన్నారు. దీంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు చెప్పారు. అయినప్పటికీ వైద్యుల సూచనల మేరకు వారం రోజులపాటు హైదరాబాద్లోనే ఉండాల్సి ఉందన్నారు. మూడు రోజులకు ఒకసారి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచించారన్నారు. పరీక్షల అనంతరం త్వరలోనే మండపేట చేరుకుంటానని ఆయన తెలిపారు.
ఇవీ చదవండి:కొవిడ్ మృతదేహాలను తీసుకెళ్లే అంబులెన్సులకు నిర్ణీత ఛార్జీలు