తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత పెరుగుతోంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు నమోదైన కేసుల వివరాలతో కొవిడ్-19 విభాగం విడుదల చేసిన బులెటిన్లో తాజాగా 1,367 పాజిటివ్ కేసులు వచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు 15,841 మందికి వైరస్ సోకినట్లు పేర్కొన్నారు. అధికంగా కాకినాడ నగరంలో 338, కాకినాడ గ్రామీణం మండలంలో 90, రాజమహేంద్రవరం నగరంలో 203, రాజమహేంద్రవరం గ్రామీణ మండలంలో 67, అమలాపురంలో 55 చొప్పున గరిష్ఠంగా కేసులు నమోదయ్యాయి.
- జులై నుంచే వ్యాప్తి..
జిల్లాలో తొలికేసు నమోదైన మార్చి 21 నుంచి ఇప్పటి వరకు (128 రోజుల్లో) 15,841 కేసులు వెలుగు చూశాయి. జూన్ నెల చివరి వరకు తక్కువ సంఖ్యలోనే కేసులు వచ్చినా.. ఈ నెల ప్రారంభం నుంచి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రత్యేకంగా ఈనెల 16 దాటిన తర్వాత 20, 21, 22, 26 మినహా మిగిలిన తేదీల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. జూన్ నుంచి పలు రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరగటంతో కేసుల సంఖ్య కూడా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
- 134కు చేరిన మరణాలు..
జిల్లాలో ఇప్పటి వరకు 134 మంది కరోనాతో మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొవిడ్-19 బులెటిన్లో పేర్కొంది. గత 24 గంటల్లో జిల్లాలో అయిదుగురు మృతి చెందినట్లు వెల్లడించారు. అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో రాజమహేంద్రవరానికి చెందిన ఇద్దరు, హైదరాబాద్ వాసి ఒకరు మృతి చెందారు. మండపేటలో ఒకరు, ప్రత్తిపాడులో విశ్రాంత ఉపాధ్యాయిని, పెద్దాపురంలోని నువ్వుల వీధిలో ఒకరు, కరప మండలం పెనుకుదురు మహిళ, ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మృతిచెందారు.
- నలుగురు గర్భిణులకు పాజిటివ్
రావులపాలెం పట్టణం ఊబలంక పీహెచ్‌సీ వద్ద 24 మంది గర్భిణులకు కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు పీహెచ్‌సీ వైదాధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. రావులపాలెంలో రెండు, వెదిరేశ్వరంలో ఒకటి, మెర్లపాలెంలో ఒకటి వచ్చాయన్నారు.
- భర్త ఇక లేడని...