సత్యదేవుడుని దర్శించాలంటే సంప్రదాయంగా వెళ్లాల్సిందే - annavaram
అన్నవరంలో సత్యదేవుడుని దర్శించాలంటే ఇకపై సంపద్రాయ దుస్తుల్లోనే వెళ్లాల్సి ఉంటుంది. తిరుమల, ఇంద్రకీలాద్రి తరహాలో అన్నవరంలోనూ భక్తుల వస్త్రధారణపై నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో సంప్రదాయ వస్త్రధారణ నిబంధన అమల్లోకి రానుంది. సత్యదేవుని ఆర్జిత సేవలు, నిత్యకల్యాణం, వ్రతాలు, దర్శనానికి సైతం సంప్రదాయ వస్త్రధారణతో భక్తులు రావాల్సి ఉంటుంది. జులై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆ దేవస్థానం ఈవో ఎం.వి.సురేష్‌బాబు ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. స్వామి దర్శనానికి భక్తులు కొందరు ఆధునిక వస్త్రధారణతో వచ్చే ధోరణికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. వ్రతాలు, ఇతర పూజల్లో పాల్గొనే సమయంలో, దర్శనానికి పురుషులు పంచె, కండువా లేదా కుర్తా, పైజమా, మహిళలు చీర, జాకెట్టు లేదా పంజాబీ డ్రెస్, చున్నీ, చిన్నపిల్లలైతే లంగా, జాకెట్టు, ఓణి వంటి దుస్తులను మాత్రమే ధరించి రావాల్సి ఉంటుందని వెల్లడించారు. దేవస్థానంలో వసతిగదులకు డిమాండ్ ఎక్కువగా ఉండటం, దళారులను నివారించేందుకు గదుల కేటాయింపు విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇకపై ఆధార్ కార్డుతో బయోమెట్రిక్ విధానం ద్వారా గదులను కేటాయిస్తామన్నారు. కరెంటు రిజర్వేషన్ (అప్పటికప్పుడు) గదులు పొందే భక్తులు కూడా ఇకపై సీఆర్వో కార్యాలయం (సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం) వద్ద దరఖాస్తు నింపి దీనికి ఆధార్ జత చేయాల్సి ఉంటుందన్నారు. సిఫార్సు లేఖల ద్వారా గదులను సూచించిన వారి పేరుమీద మాత్రమే బయోమెట్రిక్ విధానం ద్వారా ఇస్తామని చెప్పారు. ఆలయంలో భద్రత పరంగా కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వివరించారు. ప్రధానాలయం ప్రాంగణం ప్రాకారంలో ఉన్న పాత కల్యాణమండపాలు, వాయవ్య, నైరుతి మండపాలను ఇకపై వివాహాలకు కేటాయించబోమని స్పష్టం చేశారు. రాత్రి 9 గంటలకు ఆలయం మూసివేసిన తర్వాత తిరిగి మరుసటిరోజు తెల్లవారుజామున తెరిచే వరకు పశ్చిమ, తూర్పు రాజగోపురాల ప్రాంతం నుంచి ఎవరూ లోపల సంచరించకుండా చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు.