శునకానికి, వానరానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఎంతలా అంటే..కుక్కను చూస్తే కంటికి కనిపించనంత దూరం కోతి పరుగెడుతుంది. పంట పొలాల్లో కోతులను తరిమేందుకు రైతులు కుక్కలను ఉసిగొలుపుతారు. కొన్నిసార్లు కుక్కకు దొరక్కుండా చెట్టుపై వేలాడుతూ చుక్కలు చూపిస్తుంది వానరం. కానీ తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో మాత్రం సీన్ రివర్సైంది. జాతి వైరాన్ని మరచి కుక్క, కోతి చెట్టాపట్టాలేసుకుని (dog monkey friendship) ఊరంతా కలియ తిరుగుతున్నాయి. కుక్క వీపుపై కోతి కూర్చొని ఊరంతా షికారు చేస్తుంటే..గ్రామస్తులు చూసి ఆశ్చర్యపోతున్నారు.
Dog Monkey Friendship: జాతి వైరం మరిచే...స్నేహ గీతం ఆలపించే ! - కోతితో కుక్క స్నేహం
"దోస్త్ మేరా దోస్త్ తూహీ మేరా జాన్.. వాస్తవం రా దోస్త్.. నువ్వే నా ప్రాణం" అంటూ సినీ కవులు కవిత్వం రాసినా..స్నేహానికి ఉన్న గొప్పదనం ఎన్ని రకాలుగా చెప్పినా..వర్ణించేందుకు మాటలు చాలవు. ఒంటరిలోనూ, ఓటమిలోనూ తోడై నడిచేదే స్నేహం. కష్టంలో కన్నీరు తుడిచేదే స్నేహం. అలాంటి మైత్రిలోని మాధుర్యం చెప్పడానికి మాటలు సరిపోవు. ఈ స్నేహం మనుషులకే పరిమితం కాదు. లింగ బేధం, జాతి బేధం లేకుండా భూ ప్రపంచంలోని సమస్త జీవకోటిలోనూ (dog monkey friendship) స్నేహం చిగురిస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలో వెలుగు చూసిన ఘటనే అందుకు నిదర్శనం.
కొద్ది రోజులుగా ఏలేశ్వరంకు చెందిన ఓ వ్యక్తి కుక్కను చేరదీసి పెంచుకుంటున్నాడు. అలాగే తన ఇంటి వద్ద గాయాలతో పడి ఉన్న కోతి పిల్లను చికిత్స చేసి దానిని కూడా పెంచ సాగాడు.ఈ క్రమంలో కుక్కకి కోతికి మధ్య స్నేహం చిగురించింది. ఎటువంటి వైరం లేకుండా కోతి పిల్లను కుక్క అమ్మలా లాలిస్తుంది. ఒకదానికొకటి అమితమైన ప్రేమను పంచుకుంటూ కుక్క మీద కోతి సవారీ చేస్తుంది. ఇలాంటి ఘటనలు మనం చాలా అరుదుగా చూస్తుంటాం. ఆ రెండూ కలిసి తిరుగుతుంటే..గ్రామస్తులు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఇదీ చదవండి: వారిద్దరూ ఆలయంలో చోరీ చేయబోయారు.. సరిగ్గా అప్పుడే..!