రాజమహేంద్రవరంలోని మంగళవారపుపేటలో.. 1977 నుంచి వెంకటేశ్వరరావు మిక్చర్ పాయింట్ నడుస్తోంది. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న తనయుడు సతీశ్ ఏదైనా వెరైటీగా చేయాలనే ఉద్దేశంతో.. 2001 నుంచి రకరకాల బజ్జీలు తయారు చేస్తున్నారు. రొటీన్‌కు భిన్నంగా జామ, యాపిల్, పైనాపిల్, మామిడి, ఉల్లి, తమలపాకు, వామాకు, వంకాయ, దొండకాయ, బెండకాయ, చిక్కుడు, క్యారెట్, క్యాలీఫ్లవర్, పుట్టగొడుగు, బేబీకార్న్, టమాటా, క్యాప్సికమ్, ద్రాక్షతో బజ్జీలు వేస్తున్నారు. వీటితో పాటు జీడిపప్పు, బ్రెడ్, గులాబ్ జామ్, ఎగ్ లెస్ కేక్, పన్నీర్, ఉప్మా ఇలా 25 నుంచి 30 రకాల బజ్జీలు చేస్తారు. ఒక్కో రోజు.. కొన్ని ప్రత్యేక బజ్జీలు, సీజన్ బట్టి తయారు చేస్తారు.
ఎంతోకాలంగా వ్యాపారం జరుగుతుండడంతో తన కస్టమర్లతో ఒక వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి.. ఏ రోజు ఏ ఐటం వేసేది.. వారికి మెసేజ్ చేస్తారు. కావాల్సిన వారు ఫోన్లో ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్తారు. రాజమహేంద్రవరం.. చుట్టుపక్కల ప్రాంతాలు, కాకినాడ, తణుకు, బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వీటిని తీసుకెళ్తున్నారు. ఒక్కరోజే నిల్వ ఉండే వీటిని.. విమానంలోనూ తీసుకెళ్తారని నిర్వాహకులు చెబుతున్నారు. స్థానికంగా జరిగే శుభాకార్యాలకు ఆర్డర్లపై సప్లయ్ చేస్తున్నారు. బజ్జీ రూ.10 నుంచి గరిష్ఠంగా రూ.70 వరకు అమ్ముతున్నారు. గులాబ్‌జామ్ బజ్జీ రూ.20, జామకాయ రూ.10, పన్నీర్, క్యారెట్, మష్రూమ్ రూ.15 ఇలా ధరలు ఉన్నాయి. క్వాలిటీలో రాజీపడనని..కష్టమర్లతో ఆప్యాయంగా నడుచుకోవడమే వ్యాపారం పెరగడానికి కారణమని అంటారు సతీష్.