Dhavaleswaram as Dumping Yard: ఆధ్యాత్మికతతో అలరాలే ధవళేశ్వరం.. నేడు మురికి కూపంలా తయారైంది. పాలకుల అశ్రద్ధ, పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో.. గత రెండేళ్లుగా పారిశుద్ధ్య సమస్య ఆ ప్రాంతాన్ని పట్టిపీడిస్తోంది. భరించలేని దుర్వాసన.. దోమల దండయాత్రతో జనం అవస్థలు పడుతున్నా అధికారులకు చీమ కుట్టినట్లు అయినా లేదని స్థానికులు మండిపడుతున్నారు. సమస్య పరిష్కారానికి.. కార్యాలయాల చుట్టూ కాళ్లురిగేలా తిరిగినా.. కనీసం కన్నెత్తి చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన గ్రామ పంచాయతీల్లో ఒకటైన ధవళేశ్వరం.. నేడు పారిశుద్ధ్య సమస్యతో అల్లాడుతోంది. సుమారు 60 వేలు జనాభా ఉన్న ఈ ప్రాంతంలో.. పారిశుద్ధ్యాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. మెండా వారి వీధి, ఉడతావారి వీధి, కాటన్ పేట, లక్ష్మీ జనార్థన నగర్, జాలరుపేట, పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా రోడ్లన్నీ చెత్తాచెదారంతో నిండిపోయాయి.
Pollution in Godavari River: గోదారమ్మ ఒడిలోకి కాలుష్య వ్యర్థాలు.. పట్టించుకునేవారే కరువాయే..!
Sanitation Problem in Dhavaleshwaram: పాత ప్రభుత్వాసుపత్రి వీధిలో డంపింగ్ యార్డ్‌ను తలపించేలా చెత్త నిల్వలు పేరుకుపోయాయి. మెండావారి వీధిలో 8 నెలలు క్రితం తీసిన వ్యర్థాలను పారిశుద్ధ్య అధికారులు ఇంతవరకు తొలగించలేదు. దీంతో వర్షం పడినప్పుడల్లా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. ప్రజలు వాపోతున్నారు.
లక్ష్మీ జనార్జననగర్‌లో పంచాయతీ అధికారులు చెత్త కుండీలు ఏర్పాటు చేయకపోవడంతో ఇక్కడ ఖాళీ స్థలంలోనే చెత్త వేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం.. మినీ డంపింగ్ యార్డ్‌ని తలపిస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణ లోపంతో కాలనీల్లోని డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. అధికారులు పట్టించుకోక.. చివరికి స్థానికులే సొంత డబ్బు వెచ్చించి పూడికను తీయించుకుంటున్నారు. రాత్రి అయితే చాలు.. దోమల బెడదతో కాలనీవాసులు హడలిపోతున్నారు.