Devotees flock in AP temples:రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల్నీ భక్తులతో కిక్కిరిసాయి. కార్తీకమాసం.. అందులోనూ సెలవురోజు కావడంతో.. భారీ స్థాయిలో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వన భోజనాలకు వెళ్లేవారితో పాటు.. భక్తులు కూడా రావడంతో క్యూలైన్లు కిటకిటలాడాయి. అన్నవరంలో ఆలయ అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో... భక్తులు నానాఅవస్థలు పడ్డారు.
సింహాద్రి అప్పన్న సన్నిధి:విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధికి భక్తుల తాకిడి పెరిగింది. కార్తీకమాసం దాకితోడు సెలవు రోజు ఆదివారం కావడంతో స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భారీ స్థాయిలో రద్దీ పెరగడంతో... స్వామి వారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. కొండ దిగువన భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కనీస సౌకర్యాలూ ఏర్పాటు చేయలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్నవరం: అన్నవరం సత్యదేవుని దర్శనం కోసం ఆలయం క్యూలైన్లలో గంటలకొద్దీ భక్తులు నిరీక్షిస్తున్నారు. క్యూలైన్లలో చిన్నపిల్లలతో తల్లులు ఇబ్బందిపడుతున్నారు. భారీగా తరలిరావడంతో ఆలయం క్యూలైన్లలోని తూర్పు రాజగోపురం వద్ద తొక్కిసలాట పరిస్థితి నెలకొంది. భక్తుల మధ్య తోపులాట జరిగింది. కొండపై పార్కింగ్‌లో వందలాది వాహనాలు బారులు తీరాయి. రద్దీ నియంత్రణపై ఆలయ సిబ్బంది సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో... భక్తులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.