రాష్ట్రవ్యాప్తంగా దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు వివధ రూపాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పెద్దసంఖ్యలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. నిబంధనలకు అనుగుణంగా భక్తుల దర్శనానికి దేవస్థాన పాలకవర్గాలు, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో..
తణుకు మండలం దువ్వ గ్రామంలో శరన్నవారత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దువ్వలోని దానేశ్వరి అమ్మవారు... లలితా దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు కృపాకటాక్షాలు ప్రసాదించాలని కోరుతూ.. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. జగజ్జననిగా, జ్ఞాన ప్రసాదినిగా అమ్మవారు భక్తజనుల పూజలందుకుంటున్నారు. లలితాదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే జ్ఞానం ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం.
తణుకులో వేంచేసి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ప్రత్యేక అలంకరణలో తీర్చిదిద్దారు. భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆర్య వైశ్యుల ఆరాధ్య దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని నవరాత్రుల సందర్భంగా దర్శించుకుంటే సర్వశుభాలు జరుగుతాయని భక్తులు విశ్వాసం. భక్తుల తరపున గోత్ర నామాలతో ఏకాంత పూజలు చేసేలా ఏర్పాటు చేశారు. కొవిడ్-19 నిబంధన మేరకు సామూహిక కుంకుమ పూజలు నిలిపివేశారు.
నిడదవోలులోని కోట సత్తెమ్మ వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు. అధికసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. కోట చట్టం ఆలయానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆలయంగా గుర్తింపు ఉంది. అమ్మవారిని నవరాత్రి పర్వదినాల్లో దర్శించుకుంటే శక్తిని ప్రసాదిస్తుందని, దుష్ట శక్తుల నుంచి కాపాడుతుందని భక్తులు నమ్ముతారు.